
Revanth Reddy: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీ సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
ఒక్క కడియం శ్రీహరి తప్ప, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ ప్రత్యేక భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా హాజరయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ జారీ చేసిన నోటీసులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఏం జరుగబోతోందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి తర్వాత కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, మూడు నెలల్లోగా పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
Details
ఫిరాయింపుల కేసులు పెండింగ్ లో ఉండటం సరికాదు
అలాగే, సంవత్సరాల తరబడి ఫిరాయింపు కేసులు పెండింగ్‌లో ఉండటం సరికాదని, రాజకీయ అశాంతికి అడ్డుకట్ట వేయాలని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ 10 మంది ఎమ్మెల్యేలకూ నోటీసులు పంపారు. ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానాలు ఇచ్చారు. మిగిలిన వారి సమాధానాల కోసం స్పీకర్ ఎదురు చూస్తుండగా, రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు.
Details
రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
''కేసీఆర్‌ను గౌరవించే వారిలో నేనే మొదటి వ్యక్తిని. పార్టీ లైన్ దాటిన సందర్భం ఎప్పుడూ లేదు. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. అయితే, మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలంతా కడియం శ్రీహరిని మినహాయించి రేవంత్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశమైంది. మొత్తం మీద, సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసులు, ఫిరాయింపు పిటిషన్లపై రాబోయే పరిణామాల దృష్ట్యా సీఎం రేవంత్ వ్యూహాలు ఏంటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.