Chandrababu: ఉత్తరాంధ్రలో తుపానులకు వ్యూహం సిద్ధం.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన చంద్రబాబు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు 10వ రోజుకి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సమీక్ష జరిపారు. అధికారులను ఎవరూ వెనుకబడకూడదని, వరద ముంపు ఇళ్లపై ఎన్యుమరేషన్‌ను బుధవారం సాయంత్రానికి పూర్తి చేయాలని సీఎం ఆదేశాలను జారీ చేశారు. విజయవాడ నగరంలో ఈ రోజు సాయంత్రం నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని సీఎం అన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. నిత్యావసరాల సరుకుల పంపిణీ సాఫీగా జరుగుతోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం తుపానులు అధికంగా వచ్చే ప్రాంతమని గుర్తించి, ఈ ప్రాంతంలో త్వరితగతిన వ్యూహాలను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ముందు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం తక్కువగా ఉండిందని ఆయా జిల్లాల కలెక్టర్లు వివరించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వరదలు, వాగులు, వంకలు ప్రమాదకరంగా ఉన్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను హెచ్చరించారు.