Page Loader
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు బృందం ప్రత్యేక ఫోకస్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు బృందం ప్రత్యేక ఫోకస్

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు బృందం ప్రత్యేక ఫోకస్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక విడుదలైన తర్వాత లేనిపోని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోగా,సాధారణ ప్రయాణికుల్లోనూ భయాందోళనలు పెరిగాయి. పైలట్ ఆత్మహత్య చేసుకున్న కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ వాస్తవాలు మరొకలా ఉన్నాయి. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చిన విమానానికి ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సురక్షితంగా ల్యాండ్ అయింది. కానీ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన సమయంలో ఇంధన స్విచ్‌లు రెండూ అకస్మాత్తుగా ఆగిపోయాయి. వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాఫ్ట్‌వేర్ కూడా పని చేయలేదు. ఫలితంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోయింది.

వివరాలు 

టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఆగిన ఇంధన సరఫరా

కానీ దర్యాప్తులో ఇంధన స్విచ్‌లు సరిగ్గానే పనిచేస్తున్నట్లు తేలింది. టేకాఫ్ అయిన తర్వాత మాత్రమే అవి ఎందుకు ఆగిపోయాయన్న అంశంపై అనుమానాలు తలెత్తాయి. ప్రస్తుతం దర్యాప్తు బృందం ఇదే అంశంపై దృష్టి పెట్టిందని సమాచారం. ప్రాథమిక నివేదిక ప్రకారం, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఇంధన సరఫరా ఆగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందా? లేదా సాఫ్ట్‌వేర్‌లో లోపం తలెత్తిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తుది నివేదిక కోసం అధికారులు సాంకేతికంగా లోతైన పరిశీలన చేస్తున్నారు. ఇంజిన్‌లో ఏదైనా సాంకేతిక లోపం వల్ల సమస్య తలెత్తిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. టేకాఫ్ సమయంలో ఇంధన నియంత్రణ స్విచ్‌లు కట్-ఆఫ్ మోడ్‌లోకి ఎలా మారాయన్న విషయంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

వివరాలు 

'స్టెబిలైజర్ పొజిషన్ ట్రాన్స్‌డ్యూసర్ లోపం'

విద్యుత్ సమస్యలు లేదా సాఫ్ట్‌వేర్ వైఫల్యాలు ఏమైనా తలెత్తాయా? అన్న కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. లేదంటే సిస్టమ్-ట్రిగ్గర్డ్ అన్‌కమాండ్డ్ ట్రాన్సిషన్ వల్ల ఇంజిన్లు అనుకోకుండా ఆపివేసే పరిస్థితి ఏర్పడిందా? అనే కోణాన్ని కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతోపాటు, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు పైలట్ ఒకరు 'స్టెబిలైజర్ పొజిషన్ ట్రాన్స్‌డ్యూసర్ లోపం'ని గుర్తించినట్టు ఒక అధికారి తెలిపారు. ఈ ట్రాన్స్‌డ్యూసర్ ద్వారా విమాన నియంత్రణ వ్యవస్థకు సంకేతాలు పంపించి, విమానాన్ని స్తిరంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. బోయింగ్ నిబంధనల ప్రకారం,ఈ లోపం పరిష్కరించబడ్డదన్న సమాచారం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా విమానంలో అనుకోకుండా ఇంధన కట్-ఆఫ్ సిగ్నల్ చేరే అవకాశం ఉందని, అదే ఈ ప్రమాదానికి కారణమైనందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ప్రాణాలతో బయటపడిన 11A సీట్లో కూర్చున్న ప్రయాణికుడు

లేకపోతే సెన్సార్ వైఫల్యాల వల్ల ఇంజిన్ ఆపివేసినదా? అనే కోణాన్ని కూడా దర్యాప్తు బృందాలు పరిశీలిస్తున్నాయి. ఇక కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్ ప్రకారం, పైలట్‌లలో ఒకరు మరొక పైలట్‌ను ''నీవెందుకు కట్-ఆఫ్ చేశావ్?'' అని ప్రశ్నించగా, ఆయన ''నేను అలా చేయలేదు'' అని స్పందించిన ఆడియో రికార్డు వెలుగుచూసింది. ఇదిలా ఉండగా, 11A సీట్లో కూర్చున్న ప్రయాణికుడు విశ్వాశ్‌కుమార్ రమేష్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు దర్యాప్తు అధికారులకు తెలిపిన వివరాల ప్రకారం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద శబ్దం విన్నట్లు, వెంటనే విమానం ఆగిపోయినట్లు చెప్పాడు. ఆకుపచ్చ, తెలుపు లైట్లు మిణుకుమిణుకుమంటున్నాయని వివరించాడు. పైలట్లు విమానం కూలకుండా చేయడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, చివరకు కూలిపోయిందని రమేష్ చెప్పాడు.

వివరాలు 

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హాస్టల్‌పై కూలిన విమానం

విమానం కూలిపోకముందు కేవలం 625 అడుగుల ఎత్తులో మాత్రమే ఉందని, అదే 3,600 నుంచి 4,900 అడుగుల ఎత్తులో ఉంది ఉంటే ప్రమాదాన్ని తప్పించొచ్చని అధికారులు తెలిపారు. అందుకే పైలట్లు విమానాన్ని నియంత్రించలేకపోయారు. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు బయల్దేరింది. కానీ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమీపంలోని హాస్టల్‌పై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్కరిని మినహాయిస్తే 241 మంది ప్రయాణికులు మృతిచెందారు. హాస్టల్‌లో ఉన్న మెడికల్ విద్యార్థులు కూడా మరణించడంతో మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా రూ.1 కోటి చొప్పున పరిహారం చెల్లించింది.