
Congress: రేపటి నుంచి అహ్మదాబాద్‌లో ఏఐసీసీ కీలక సమావేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో రేపటి నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనుంది.
మంగళవారం, బుధవారం రోజుల్లో జరగబోయే ఈ సమావేశాలలో పార్టీ పునరుద్ధరణ, భవిష్యత్ వ్యూహాలపై ప్రముఖ నేతలతో సమగ్రంగా చర్చలు జరగనున్నాయి.
64 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్ ఈ సమావేశాలకు వేదిక కావడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
గతంలో 1938లో బర్దోలి, 1961లో భావనగర్‌లలో ఈ తరహా సమావేశాలు నిర్వహించారు.
ఈసారి సమావేశాలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో జరుగుతాయి.
ఇందులో కాంగ్రెస్ మాజి అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏఐసీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.
వివరాలు
ఎదురయ్యే సవాళ్లపై చర్చలు
తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ వంటి నాయకులు హాజరవుతున్నారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లపై చర్చలు జరిపి, తగిన కార్యాచరణను రూపొందించేందుకు ఈ సమావేశాలు కీలకంగా నిలవనున్నాయి.
గతేడాది డిసెంబర్ 26, 27 తేదీల్లో కర్ణాటక రాష్ట్రంలోని బెలగావిలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో గుజరాత్‌లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో, ఈసారి మహాత్మా గాంధీ పుట్టిన రాష్ట్రంలోనే సమావేశాలు జరుగుతున్నాయి.
వివరాలు
సమావేశాల్లో కీలక వ్యూహాలు
ఇక పలు రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాల్లో కీలక వ్యూహాలు రచించనున్నారు.
పార్టీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని,శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా చర్చలు సాగనున్నాయి.
ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో ఢిల్లీలో రాష్ట్రాల వారీగా డీసీసీ అధ్యక్షులతో అధిష్టానం ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది.
ఈ ఏడాది చివరిలో బీహార్‌లో,వచ్చే ఏడాది తమిళనాడుకేరళ, అస్సాం,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో, 2028లో మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నారు.
చివరగా,2029లో పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో, భవిష్యత్తు రాజకీయ ప్రయాణానికి రోడ్‌మ్యాప్ రూపొందించేందుకు ఈ సమావేశాల్లో విస్తృతంగా మేథోశక్తిని వినియోగించనున్నారు.