Delhi: ఎయిరిండియా విమానం 8 గంటలు ఆలస్యం.. AC పని చేయక అల్లాడిన ప్రయాణికులు
దిల్లీలో ఎయిర్ ఇండియా విమానం 8 గంటలు ఆలస్యమవడంతో, వేడి కారణంగా ప్రయాణికుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. విమానాలు ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్టులో ఎయిర్ కండిషన్ కూడా పని చేయకపోవడంతో జనం ఉక్కపోతకు గురయ్యారు. దీంతో ప్రజలు అపస్మారక స్థితిలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. దీంతో ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసి.. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకి ట్యాగ్ చేశారు. ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం 8 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
8 గంటల పాటు ఏసీ లేకుండా విమానంలోనే..
ఎయిరిండియా ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యమైందని చెబుతున్నారు. ప్రయాణికులను 8 గంటల పాటు ఏసీ లేకుండా విమానం లోపల ఉంచారు. విమానం ఆలస్యం కావడంతో 8 గంటల పాటు ఏసీ లేకుండా విమానంలోనే ఉంచడంతో ప్రయాణికుల పరిస్థితి విషమంగా మారింది. విమానంలో వేడి కారణంగా చాలా మంది ప్రయాణికులు అపస్మారక స్థితికి చేరుకున్నారు, దీంతో వారందరినీ విమానం నుండి బయటకి పంపించారు . ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు.
ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత
ఎయిర్ ఇండియా విమానాలు, విమానాశ్రయాల్లో ఏసీ పనిచేయకపోవడంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఢిల్లీలో కూడా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం ఈ విమానం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరుతుందని సమాచారం. అయినప్పటికీ, చాలా మంది ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు ఆరోగ్యం క్షీణించడంతో ఇంటికి తిరిగి వెళ్లారు.