డ్యూటీ అవర్స్ ముగిశాయని ఫ్లైట్ నడపనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు
ఎయిర్ ఇండియా విమానం మరో వివాదాస్పద ఘటనకు తావిచ్చింది. ప్రయాణికులతో నిండి ఉన్న విమానంలోకి ఎక్కేందుకు పైలెట్ నిరాకరించారు. లండన్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆదివారం జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం గమ్యస్థానం దిల్లీకి విమానం నడిపేందుకు పైలట్ ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో సుమారు 350 మంది ప్రయాణికులు 5 గంటల పాటు ఫ్లైట్ లోనే గడిపారు. షెడ్యూల్డ్ ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకే సదరు విమానం దిల్లీకి చేరాల్సి ఉంది. అయితే దిల్లీ విమానాశ్రయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో జైపూర్‌కు దారి మళ్లించారు.
విధుల సమయం ముగిసిందంటూ ఫ్లైట్ దిగిపోయిన పైలట్
అంతకుముందే సదరు ఫ్లైట్ లండన్ నుంచి వచ్చి దిల్లీ విమానాశ్రయం చుట్టూ 10 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ రాకపోవడంతో జైపూర్‌లో ల్యాండైంది. దాదాపు 2 గంటల తర్వాత ఎయిర్ ఇండియా విమానం సహా మరికొన్ని ఫ్లైట్లకూ జైపూర్ నుంచి వచ్చేందుకు దిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే విమానాన్ని నడిపేందుకు పైలట్ తిరస్కరించాడు. విధుల సమయం ముగిసిందంటూ కిందికి దిగిపోయాడు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందిపడ్డారు. స్పందించిన యాజమాన్యం, అత్యవసరమైన వారిని రోడ్డు మార్గానా దిల్లీకి తరలించింది. సిబ్బంది మార్పుల చేర్పుల తర్వాత అదే ఫ్లైట్ లో మిగతా ప్రయాణికులను తరలించింది.