Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ ఈ కాలుష్యం మరింతగా తీవ్రమవుతోంది. గురువారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత అతి పేలవమైన స్థాయిలో నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, ఉదయం 9 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత 367గా ఉంది. ఆనంద్ విహార్, జహంగీర్‌పురి, అశోక్ విహార్, బావన, ముంద్కల్, రోహిని, సోనియా విహార్, వివేక్ విహార్, వాజీపూర్ వంటి తొమ్మిది ప్రాంతాల్లో గాలి నాణ్యత అత్యంత తీవ్రమైన స్థాయిలో ఉందని కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. కాలుష్యం వల్ల ఢిల్లీ వాసులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రజలపై నీటి కాలుష్య ప్రభావం
వాయు కాలుష్యం కారణంగా ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిన పరిస్థితుల్లో, మరోవైపు నీటి కాలుష్యం కూడా ప్రజలపై ప్రభావం చూపుతోంది. యమునా నదిలో కాలుష్య స్థాయి పెరిగిపోవడం దీనికి మరో కారణం. గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే మంచి స్థాయిలో ఉందని, 51-100 సంతృప్తికరంగా ఉందని, 101-200 మధ్య ఉంటే మితంగా ఉందని, 201-300 తక్కువ నాణ్యతగా, 301-400 మధ్య ఉంటే చాలా పేలవమైందని, 401-500 అయితే ప్రమాదకరంగా పరిగణిస్తారు.
గాలి నాణ్యతలో మెరుగుదల
గత కొంతకాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరిందని స్పష్టంగా తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలడం, మంచు కారణంగా ఢిల్లీ మొత్తం పొగమంచుతో కమ్ముకుపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు. కాలుష్య నియంత్రణకు అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేసినా, గాలి నాణ్యతలో మెరుగుదల కనిపించడం లేదు. ఈ పరిస్థితుల వల్ల నగర వాసులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.