Delhi Air Pollution: దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం కఠిన చర్యలు.. జరిమానాల మొత్తాలు రెట్టింపు
దిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైతులు తమ పంట వ్యర్థాలను కాల్చితే గరిష్ఠంగా రూ.30 వేలు వరకు జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది. దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపర్చడం కోసం ఈ చర్య చేపట్టింది. తక్షణం అమలులోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, 2ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తే రూ.5వేలు జరిమానా చెల్లించాలి. అదే 2-5 ఎకరాల మధ్య భూమి కలిగినవారికి రూ.10 వేలు, 5ఎకరాలకన్నా ఎక్కువ భూమి కలిగినవారికి రూ.30 వేలు జరిమానా విధిస్తారు. ఈ నిబంధనలు'ది కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ చట్టం-2021' లో భాగంగా అమలులోకి వచ్చాయి.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 356
గత నెల చివరలో దిల్లీలో కాలుష్యం అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సమయంలో కేంద్రం తీసుకున్న చర్యలను విమర్శించింది. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్రం కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని, అమలుకు అధికారులు నియమించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి మాట్లాడుతూ, పర్యావరణ చట్టాల ప్రకారం జరిమానాలను కఠినంగా అమలు చేస్తామని న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. ఇటీవలి కాలంలో దిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత మించి తారాస్థాయికి చేరుకుంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 356కు చేరింది. ఈ కారణంగా కేంద్రం జరిమానా మొత్తాలను పెంచే నిర్ణయం తీసుకుంది.