Bomb threats: ఇండియాలో విమానాలే టార్గెట్.. రెండు వారాల్లో 350 బెదిరింపులు
కేంద్ర ప్రభుత్వం విమాన బెదిరింపులపై గట్టి చర్యలు తీసుకుంటున్నా.. ఈ తరహా ఘటనలు కొనసాగుతుండటం గమనార్హం. ఇవాళ కూడా మరో 50 విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. గత 14 రోజుల్లోనే మొత్తం 350కి పైగా విమానాలకు ఈ తరహా బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి. ఆకాశ ఎయిర్‌లైన్స్ తన సంస్థకు చెందిన 15 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించింది. ఇవి పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే సర్వీసులు కొనసాగినట్లు సంస్థ తెలిపింది. ఇండిగోకు చెందిన 18 విమానాలు, విస్తారాకు చెందిన 17 విమానాలకు కూడా అలాంటి మెసేజ్‌లు అందినట్టు సమాచారం.
కఠిన చర్యలు తప్పవు
ఆదివారం మాత్రమే మొత్తం 50 విమానాలకు బెదిరింపులు రావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరహా బూటకపు బాంబు బెదిరింపులు పెరుగుతుండటంతో, కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ సామాజిక మాధ్యమాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ బెదిరింపుల్లో చాలావరకు సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్నందున, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనేందుకు సిద్ధంగా ఉందని పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు.