Ajit Doval Vladimir Putin: రష్యా ముందుకు ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక.. పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ.. యుద్ధం ఆగుతుందా?
BRICS జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. పుతిన్‌తో దోవల్ కరచాలనం చేసిన చిత్రాలను భారతదేశంలోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో (మాజీ ట్విట్టర్) పంచుకుంది. ఉక్రెయిన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ముగిసిన రెండు వారాల తరువాత అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లడం గమనార్హం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి నెలకొల్పడానికి 'పీస్ ప్లాన్' పై చర్చించేందుకు దోవల్ రష్యా వెళ్లినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఉక్రెయిన్ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు.
భారత్‌పై పుతిన్ ప్రశంసలు
యుద్ధం ముగించడానికి రష్యా, ఉక్రెయిన్ దేశాలు కలిసి చర్చలు జరపాలని, దౌత్యం,చర్యల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, శాంతి పునరుద్ధరణలో భారత్ క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. ఈ క్రమంలో రష్యా చేరుకుని పుతిన్‌తో దోవల్ భేటీ అయ్యారు. దోవల్‌తో భేటీ సందర్భంగా పుతిన్ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. వాస్తవానికి, ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన గురించి అజిత్ దోవల్ గురువారం రష్యా అగ్రనేత వ్లాదిమిర్ పుతిన్‌కు అధికారికంగా తెలియజేశారు. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనే కొత్త ప్రయత్నాల మధ్య కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల గురించి కూడా ఆయన తెలియజేశారు.
శాంతి చర్చల కోసం దోవల్ రష్యా పర్యటన
దోవల్ రష్యా పర్యటనకు శాంతి చర్చల కోసం వెళ్లినట్లు సమాచారం. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ శాంతి ప్రణాళికను పుతిన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో, రష్యాలోని కజాన్ నగరంలో వచ్చే నెలలో జరగబోయే వార్షిక బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ 22న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించారు. "మేము మా స్నేహితుడు మోదీ కోసం ఎదురుచూస్తున్నాం. ఆయనకు శుభాకాంక్షలు" అని రష్యా మీడియా సమావేశంలో పుతిన్ వ్యాఖ్యానించినట్లు రష్యన్ ఎంబసీ తెలిపింది.
ఇప్పుడు ఏం జరగబోతోంది?
ఈ భేటీ తర్వాత రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడంలో భారత్ చేస్తున్న కృషిని చాలా దేశాలు ప్రస్తావించాయి. న్యూఢిల్లీకి ఇరు దేశాలతో సత్సంబంధాలు ఉన్నందున రష్యా,ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో భారత్ పాత్ర ఉండాలనే డిమాండ్ గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఇది మాత్రమే కాదు, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని జెలెన్స్కీతో తన సంభాషణ తర్వాత ఈ సుదీర్ఘ వివాదానికి పరిష్కారం కనుగొనడంలో భారతదేశం, చైనా పాత్ర పోషిస్తాయని అన్నారు.
భారతదేశం శాంతికి అనుకూలం
జెలెన్స్కీతో తన సంభాషణలో,ఉక్రెయిన్- రష్యా రెండూ యుద్ధాన్ని ముగించడానికి సమయం వృథా చేయకుండా కలిసి కూర్చోవాలని, ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడంలో భారతదేశం 'క్రియాశీలక పాత్ర'పోషిస్తుందని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం శాంతికి అనుకూలంగా ఉందని, సంక్షోభం శాంతియుత పరిష్కారానికి వ్యక్తిగతంగా కూడా సహకరించాలని ప్రధాని అన్నారు. ఇప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.