Ajit Pawar: బారామతి విమాన ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు.. అజిత్ పవార్‌ను కాపాడేందుకు యత్నించి విఫలం
ఈ వార్తాకథనం ఏంటి
బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడం పట్ల రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగిపోయారు. బారామతిలో ఈ ప్రమాదాన్ని స్థానికులు ముందుగానే గమనించినట్లు తెలిపారు. బారామతి విమానాశ్రయానికి సుమారు 100 మీటర్ల దూరంలోనే విమానం కూలిపోయిందని చెప్పారు. విమానం చాలా తక్కువ ఎత్తుకు దిగివస్తుండటాన్ని చూసిన స్థానికులు, ఇది కూలిపోతుందేమోనని అనుమానించామని వెల్లడించారు. అలా చూస్తుండగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించి విమానం కుప్పకూలిందని తెలిపారు.
వివరాలు
గాగుల్స్, చేతి వాచీ ఆధారంగా అజిత్‌ను గుర్తు పట్టిన స్థానికులు
విమానం నేలపై పడిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయని, ఆ సమయంలో రెండు మృతదేహాలు కొంత దూరంలో పడిపోయినట్లు కనిపించాయని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా నాలుగు నుంచి ఐదు సార్లు పెద్ద శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. చేతివాచీ, కళ్లద్దాల ఆధారంగా అది అజిత్ పవార్ అని గుర్తించి బయటకు లాగేందుకు ప్రయత్నించామని, కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిసిందని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని స్థానికులు చెప్పారు. అజిత్ పవార్‌కు బారామతి నియోజకవర్గంలో బుధవారం పలు కార్యక్రమాలు ఉండటంతో, వాటిలో పాల్గొనేందుకు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ముంబై నుంచి బారామతికి విమానంలో బయలుదేరారు.
వివరాలు
విమానంలో సాంకేతిక లోపం
ప్రయాణ సమయంలో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు పైలట్ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఉదయం 8 గంటల 42 నిమిషాలకు బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసేందుకు మొదటి ప్రయత్నం చేశారు. అనంతరం రెండోసారి కూడా ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. మూడోసారి ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ల్యాండింగ్ ప్రయత్నం జరుగుతున్న సమయంలో రాడార్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోయి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో అందులో ఉన్నవారు సజీవదహనం అయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.