
అజిత్ పవార్ ఉదంతం: 2024 ఎన్నికల వేళ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ
ఈ వార్తాకథనం ఏంటి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అగ్రనేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మరోసారి తన మామకు షాకిచ్చారు.
తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-ఏక్‌నాథ్ ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ ప్రమాణ స్వీకారం చేశారు.
శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన కొన్ని వారాల తర్వాత అజిత్ పవార్ బీజేపీ శిబిరంవైపు మళ్లారు. ఇది తన మామ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
దేశంలో శరద్ పవార్‌కు మించిన యాక్టివ్ రాజకీయ కురవృద్ధుడు లేరు. 2024ఎన్నికల్లో తన రాజకీయ సీనియార్టీతో ప్రతిపక్ష ఫ్రంట్‌ను ముందుండి నడిపించాలని ప్రయత్నించిన శరద్ పవార్ ఆశలను అజిత్ పవార్ అడియాశలు చేశారు.
మహారాష్ట్ర
2019 నుంచి మూడుసార్లు డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం
2019 నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు.
2019లో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత శరద్ పవార్ రాజకీయ వ్యూహంతో రోజుల వ్యవధిలోనే ఫడ్నవీస్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
అనంతరం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కూడా అజిత్ పవార్ మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
ముచ్చటగా మూడోసారి ఆదివారం ఆయన మరోసారి డిప్యూటీగా ప్రమాణం స్వీకారం చేశారు.
మహారాష్ట్ర
అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చనున్నారా?
ప్రస్తుతానికి అజిత్ పవార్ బీజేపీలో చేరలేదని ఎన్డీఏ వర్గాలు చెబుతున్నాయి. 40 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉపముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ద్వారా ఆయన పార్టీని చీల్చి, అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అజిత్ పవార్ వ్యవహారంపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందించారు. తాను శరద్ పవార్‌తో మాట్లాడినట్లు చెప్పారు.
ఆయన మనో ధైర్యంతో ఉన్నారని చెప్పారు. ప్రజల మద్దతు తమతే ఉందని, మళ్లీ ఉద్ధవ్ ఠాక్రేతో ప్రభుత్వాన్ని పునర్నిర్మిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు సంజయ్ రౌత్ అన్నారు.
అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయానికి శరద్ పవార్ మద్దతు లేదని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి మహేశ్ తపసే పేర్కొన్నారు.
మహారాష్ట్ర
2019లో బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్ ఎందుకు బయటకు వచ్చాడంటే?
2019లో వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు హంగ్ ఏర్పడింది.
ఈ క్రమంలో తన వర్గం ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ బీజేపీ కూటమిలో చేరారు. దీంతో మహారాష్ట్రలో సీఎంగా ఫడ్నవిస్, డిప్యూటీగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.
అప్పటి వరకు అజిత్ పవార్‌కు మద్దతుగా ఉన్న ఎమ్మేల్యేలు శరద్ పవార్ ఆశీర్వాదంతోనే ఆయన బీజేపీకి మద్దతు ఇస్తున్నారని అనుకున్నారట.
ఈ క్రమంలో శరద్ పవార్ ప్రెస్‌మీట్ పెట్టి అజిత్ పవార్‌కు తన మద్దతు లేదని చెప్పడంతో ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్సీపీలోకి వచ్చారు.
దీంతో చేసేది ఏమీ లేక అజిత్ పవార్ మళ్లీ తన మేనమామ శరద్ పవార్‍ను ఆశ్రయించాల్సి వచ్చింది.