
National Highway 165 Update: ఏపీలో మరో నేషనల్ హైవే.. భీమవరం బైపాస్‌కు లైన్ క్లియర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర సహకారంతో జాతీయ రహదారులతో పాటు ఇతర ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని 165వ నెంబరు జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నారు. ఆకివీడు నుండి దిగమర్రు వరకు ఈ విస్తరణ జరుగుతుండగా, ఈ పనుల కోసం రూ.1200 కోట్లు మంజూరు చేశారు. అయితే, భీమవరంలోని బైపాస్ రహదారి ప్రతిపాదనపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సమస్య ఎదురైంది. స్థానికంగా కొందరు కోర్టుకు వెళ్లడంతో విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ రంగంలోకి దిగారు.
వివరాలు
దక్షిణ దిశలో కొత్త మార్గం
భీమవరం బైపాస్‌కు సంబంధించి గతంలో ఉత్తర దిశలో ఉన్న రెండు ప్రతిపాదనలతో పాటు, ఈసారి దక్షిణ దిశలోనూ కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ మార్గానికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో భూసేకరణ ప్రారంభించనున్నారు. ఈ కొత్త మార్గం ప్రకారం, ఆకివీడు సమీపంలోని దుంపగడప వద్ద ప్రారంభమై, జక్కరం, ఉండి మండలాల మీదుగా సాగుతుంది. అక్కడి నుంచి కాళ్ల మండలంలోని గ్రామాల గుండా వెళ్లి, భీమవరం పట్టణం, గునుపూడి శివారు ద్వారా తాడేరు చేరుకుంటుంది. తదుపరి, పాలకోడేరు మండలం మీదుగా వీరవాసరంలో చేరి, అక్కడి నుంచి పాలకొల్లు మండలాన్ని దాటి దిగమర్రు కూడలిలో జాతీయ రహదారితో కలుస్తుంది.
వివరాలు
భీమవరంలోని బైపాస్ పనులకు అనుమతులు
ఈ కొత్త హైవే నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ ఆమోదం లభించినట్టు అధికారులు తెలిపారు. ఏయే సర్వే నంబర్లకు చెందిన భూములు దీనికి అవసరమవుతాయో ఖరారు చేయాల్సి ఉండగా, దీనిపై కలెక్టర్ ఆధ్వర్యంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ హైవే పనులు పూర్తికాగానే పశ్చిమ గోదావరి జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి. భీమవరంలోని బైపాస్ పనులకు కూడా అనుమతులు లభించడంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.