
Traffic Alert : హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్.. రేపటి నుంచి సెప్టెంబర్ 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ ఖైరతాబాద్‌లో బుధవారం నుంచి బడా గణేశ్ ప్రతిష్టించనున్నారు. గణనాథుడి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో, పోలీసులు విస్తృతంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ నెల ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖైరతాబాద్, షాదాన్ కాలేజీ, నిరంకారి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, మింట్‌కాంపౌండ్, నెక్లస్ రోటరీ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతుందని అంచనా వేశారు. దాంతో, పది రోజులపాటు వాహనాల రాకపోకలకు డైవర్షన్లు అమల్లోకి వస్తాయి. వాహనదారులు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
Details
ట్రాఫిక్ డైవర్షన్లు ఇలా ఉంటాయి
పీవీ విగ్రహం నుంచి మింట్‌కాంపౌండ్‌కు రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా వచ్చే వాహనాలను అక్కడి నుంచి అనుమతించకుండా, రాజీవ్‌గాంధీ విగ్రహం వద్దే నిరంకారి జంక్షన్‌వైపు మళ్లిస్తారు. సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి రాజ్‌దూత్ లేన్ మీదుగా బడాగణేశ్ వద్దకు వచ్చే ప్రజలను ఇక్బాల్ మినార్‌వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి మింట్‌కాంపౌండ్ మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను ఐమాక్స్ థియేటర్ వైపు తిప్పుతారు. మింట్‌కాంపౌండ్ మీదుగా వచ్చే వాహనాలను సెక్రటేరియేట్ క్రాస్ టెంపుల్ వద్ద తెలుగుతల్లి జంక్షన్‌వైపు మళ్లిస్తారు. నెక్లస్ రోటరీ నుంచి మింట్‌కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు పంపిస్తారు. నిరంకారి నుంచి పోస్టాఫీస్ మీదుగా రైల్వే గేట్ వైపు వచ్చేవాహనాలను ఓల్డ్ పీఎస్ సైఫాబాద్‌వైపు మళ్లిస్తారు.
Details
పార్కింగ్ సౌకర్యం ఇలా
బడా గణేశ్ దర్శనార్థం వచ్చే వాహనాలను నెక్లస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ నుంచి రేస్‌రోడ్, ఎన్టీఆర్‌ఘాట్, హెచ్‌ఎండీఏ పార్కింగ్ (ఐమాక్స్ థియేటర్ పక్కన), ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఓపెన్ ప్లేస్, సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ప్రాంగణంలో పార్క్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే, ఖైరతాబాద్ జంక్షన్ నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను విశ్వేశ్వరయ్య భవన్‌లో పార్క్ చేయాలని సూచించారు. ముఖ్య సూచన భక్తులు గణేశ్ దర్శనానికి మెట్రోరైలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులు వంటివి ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించుకోవచ్చని పోలీసులు సూచించారు.