AP Rains: అలర్ట్.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బంగ, బంగ్లాదేశ్ తీరాలకు చేరుకొని సోమవారం నాటికి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
రాయలసీమలో మోస్తరు వర్షాలు
దీంతో శనివారం నుండి ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో శనివారం కొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. ఆదివారం మాత్రం ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.