Page Loader
Mahanadu 2025: కడప గడపలో పసుపు పండగ.. నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ
కడప గడపలో పసుపు పండగ.. నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ

Mahanadu 2025: కడప గడపలో పసుపు పండగ.. నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

పసుపు జెండాలు ఎటు చూసినా రెపరెపలాడుతున్నాయి, పచ్చని తోరణాలతో ప్రాంగణం కళకళలాడుతోంది. అడుగడుగునా ఉత్సవవాతావరణం కనిపిస్తోంది. ఎవరిని చూచినా ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు మంగళవారం నుంచి కడప గడపలో అంగరంగ వైభవంగా ప్రారంభంకానుంది. 2024 ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించిన అనంతరం జరుగుతున్న ఈ తొలి మహానాడు, మూడు రోజుల పాటు అత్యద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాక, ఇతర ప్రాంతాల నుంచి కూడా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. చివరిరోజైన గురువారం జరిగే బహిరంగ సభకు సుమారుగా ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోంది.

వివరాలు 

రోటీన్‌కు భిన్నంగా చర్చలు 

ఇక సోమవారం కడపలో వాతావరణం మేఘావృతంగా ఉండి తడిబడే చినుకులు పడుతున్న నేపథ్యంలో, వర్షం సంభవించవచ్చన్న అంచనాతో మహానాడు నిర్వహణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిసారి లాగే ఈసారి కూడా ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు, చర్చలు, ఆమోద ప్రక్రియ ఉంటాయి. అయితే ఈసారి కొంత భిన్నంగా, పార్టీ మూల సూత్రాలు, భవిష్యత్ లక్ష్యాల ప్రకారం ఆరు ప్రధాన అంశాలపై సమగ్ర చర్చలు నిర్వహించనున్నారు. కార్యకర్తే అధినేత, యువగళం, తెలుగుజాతి-విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం-పేదల ప్రగతి, అన్నదాతకు అండ అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉంటాయి.

వివరాలు 

సభా ప్రాంగణం 140 ఎకరాలు, పార్కింగ్ 450 ఎకరాలు 

కడప శివారు చెర్లోపల్లిలో మహానాడు నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ నిర్వహించేందుకు, చివరి రోజున బహిరంగ సభ కోసం 140 ఎకరాల్లో ఏర్పాటు పూర్తయ్యింది. వాహనాల పార్కింగ్ కోసం 450 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. వేదికపై దాదాపు 450 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.

వివరాలు 

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు 

మహానాడులో భాగంగా వైద్య శిబిరాలు, రక్తదాన క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. 15 పడకలతో కూడిన మెడికల్ క్యాంప్ లో ఐసీయూ సదుపాయాలు, అత్యవసర వైద్య సాయంతో పాటు, ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ జరుగుతుంది. వృద్ధులకు వినికిడి పరికరాలు, కళ్ళజోళ్లు, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేస్తారు. సాధించిన విజయాలను ప్రతిబింబించేలా ఫొటో ప్రదర్శన ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ నాయకత్వంలో పార్టీ ప్రస్థానం, విజయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సోమవారం ప్రాంగణంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధాన వేదికగా ఏర్పాటు చేసిన జర్మన్ హ్యాంగర్‌పై వర్షం నీరు చేరిన నేపథ్యంలో చుట్టూ ట్రెంచ్ తవ్వించారు. ఆ పనులను మంత్రి రామానాయుడు స్వయంగా పర్యవేక్షించారు.

వివరాలు 

మూడు రోజుల కార్యక్రమాలు ఇలా.. 

మొదటి రోజు - మంగళవారం ఉదయం 8.30 నుండి 10.00 వరకు ప్రతినిధుల నమోదు 10.00 - 10.45: ఫోటో ప్రదర్శన, రక్తదాన శిబిరం ప్రారంభం 10.45: జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలనతో సభ ప్రారంభం మృతి చెందిన నాయకులకు సంతాపం ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పణ 11.30 - 11.45: రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఉపాధ్యక్షుడి ప్రసంగాలు 11.45 - 11.50: ఖర్చుల నివేదిక 11.50 - 12.45: చంద్రబాబు ప్రసంగం 12.45 - 1.00: పార్టీ మూల సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణలపై చర్చ 1.00: జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ 2.00 - 3.30: కార్యకర్తే అధినేత అంశంపై చర్చ

వివరాలు 

వాట్సప్ గవర్నెన్స్ చర్చ 

3.30 - 5.00: యువగళం - యువత సంక్షేమం, ఉపాధి, సాంకేతిక పాలన, వాట్సప్ గవర్నెన్స్ చర్చ 5.00 - 6.00: అభివృద్ధి వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాల మౌలిక సదుపాయాలు రెండో రోజు - బుధవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు 10.15 - 1.00: తెలుగుజాతి - విశ్వఖ్యాతి ఎన్టీఆర్ సంస్కరణలు చంద్రబాబు పాలనలో అభివృద్ధి తెదేపా విజయాలు 2.00 - 2.30: స్త్రీ శక్తి - మహిళా శిశు సంక్షేమం 2.30 - 3.30: సామాజిక న్యాయం - పేదల అభివృద్ధి 3.30 - 4.30: అన్నదాతకు అండ - వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు 4.30 - 5.00: సమగ్ర సాగునీటి ప్రణాళికలు

వివరాలు 

రాజకీయ తీర్మానం

5.00 - 5.30: ప్రజల సంరక్షణ - శాంతిభద్రతలు 5.30 - 6.00: రాజకీయ తీర్మానం 6.00 - 7.00: జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణం, ప్రసంగం మూడో రోజు - గురువారం మధ్యాహ్నం 2.00 - 5.00: బహిరంగ సభ కూటమి ప్రభుత్వం లో సాధించిన విజయాలు సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత భవిష్యత్ లక్ష్యాలపై పార్టీ అధినేత, ముఖ్య నేతల దిశానిర్దేశం ఈ మహానాడు తెదేపా పార్టీకి స్ఫూర్తిని, దిశానిర్దేశాన్ని అందించబోతుంది. పార్టీ భావితరాలకు స్పష్టమైన లక్ష్యాలను అందించడంతోపాటు, ప్రజల మద్దతు మరింత బలపడేలా మారనుంది.