
Pamban Bridge: దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి.. త్వరలో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో సముద్రంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ వంతెన ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
భారీ నౌకలు వెళ్లేందుకు వీలుగా 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువుతో కూడిన ఒక భాగం 17 మీటర్ల ఎత్తుకు లేచే విధంగా దీన్ని రూపొందించారు.
తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక సాంకేతికతతో దీన్ని నిర్మించారు.
111 ఏళ్ల క్రితం నిర్మించిన పాత వంతెన క్రక్రమంగా పనికిరాని స్థితికి చేరడంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు.
శ్రీరామనవమి రోజున (ఏప్రిల్ 6) ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు.
వివరాలు
దూర ప్రయాణాన్ని తగ్గించేందుకు..
1914లో బ్రిటిష్ ప్రభుత్వం మండపం నుంచి పాంబన్ (రామేశ్వరం) వరకు రైలు వంతెనను నిర్మించింది.
పడవల రాకపోకలకు అనువుగా వంతెన మధ్యలో రోలింగ్ లిఫ్ట్‌ను అమర్చారు.
అప్పట్లో సిబ్బంది చేతితో చట్రాన్ని తిప్పి వంతెన రెండు భాగాలను పైకి లేపేవారు.
కానీ సముద్రపు నీటి ప్రభావంతో పాత వంతెన ధ్వంసమైంది. కొత్త వంతెనలో రోలింగ్ లిఫ్ట్‌కి బదులుగా ఆధునిక వర్టికల్ లిఫ్ట్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఇది లేకుంటే, నౌకలు రామేశ్వరం దాటి ధనుష్కోటి వరకు వెళ్లి తిరిగి రావాల్సి వచ్చేది, దీంతో 150 కి.మీ. అదనపు ప్రయాణం మిగిలేది.
వివరాలు
కొత్త వంతెన ప్రత్యేకతలు
ఈ వంతెన నిర్మాణానికి రూ.540 కోట్లు వ్యయం చేశారు. దీని మొత్తం పొడవు 2.10 కి.మీ. కాగా, 333 పిల్లర్లతో ఇది నిర్మించబడింది.
సముద్రగర్భంలో సగటున 38 మీటర్ల లోతు వరకు పిల్లర్లను ఏర్పాటు చేశారు.
వీటి నిర్మాణానికి 5,772 మెట్రిక్ టన్నుల రీయిన్‌ఫోర్స్‌మెంట్ స్టీల్, 4,500 మెట్రిక్ టన్నుల స్ట్రక్చరల్ స్టీల్‌ను వినియోగించారు.
మొత్తం 3.38 లక్షల సిమెంట్ బస్తాలు, 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించారు.
వివరాలు
వంతెన ప్రత్యేకతలు..
మియామీ తర్వాత ప్రపంచంలో సముద్రపు ఉప్పుగాలి అత్యధికంగా ప్రభావం చూపే ప్రాంతం పాంబన్.
ఇక్కడ వంతెన తుప్పు బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక రసాయన పదార్థాలతో పూత వేశారు.
దీనిలో జింక్, 200 మైక్రాన్ ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ పాలీ సిలోక్సేన్ పదార్థాలను ఉపయోగించారు.
కనీసం 35 సంవత్సరాలపాటు ఈ పూత తుప్పు నుండి వంతెనను రక్షించనుంది. ఆ తర్వాత మళ్లీ పూత వేశామంటే మరికొంత కాలం సమస్య రాదు.
వివరాలు
వంతెన ప్రత్యేకతలు..
పాత వంతెనపై రైళ్ల గరిష్ట వేగం గంటకు 10 కి.మీ. మాత్రమే. అయితే, కొత్త వంతెనపై రైళ్లను గంటకు 80 కి.మీ. వేగంతో నడిపే వీలుంది.
అయితే, రైల్వే సేఫ్టీ కమిషనర్ 74 కి.మీ. వేగాన్ని అనుమతించారు. 2019లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం కొవిడ్ ప్రభావంతో ఆలస్యమైనా, కేవలం 2 సంవత్సరాల్లో పూర్తయింది.
ఈ వంతెనలో ఉన్న వర్టికల్ లిఫ్ట్ భాగం కేవలం 5.20 నిమిషాల్లో 17 మీటర్ల ఎత్తుకు పైకి లేచేలా రూపొందించారు.
దీనికి కేవలం 5% విద్యుత్ వినియోగమే అవసరం. వంతెన భద్రత కోసం స్కాడా (Supervisory Control and Data Acquisition) సిస్టమ్ అమర్చారు. ఇది వంతెనలో ఏదైనా లోపం తలెత్తిన వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తుంది.
వివరాలు
1964 తుఫాను.. పునర్నిర్మాణం
1964 డిసెంబర్ 22న తమిళనాడు తీరాన్ని భారీ తుఫాను తాకింది. సుమారు 25 అడుగుల ఎత్తులో ఎగిసిన అలలు, బలమైన గాలుల ప్రభావంతో పాత పాంబన్ వంతెన పూర్తిగా ధ్వంసమైంది.
ఆ సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న 653 నంబర్ రైలు సముద్రంలో పడిపోయింది. దాంతో, 190 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
అయితే, వంతెనలోని షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ భాగం మాత్రం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొకుండా నిలిచింది.
ఈ విపత్తు తర్వాత, ప్రముఖ ఇంజనీర్ ఇ. శ్రీధరన్ నేతృత్వంలో కేవలం 46 రోజుల్లోనే వంతెన పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి.
ఇప్పుడు నిర్మించిన కొత్త వర్టికల్ లిఫ్ట్ వంతెన సముద్రంపై ట్రాన్స్‌పోర్టేషన్‌కు మరింత సౌకర్యాన్ని కల్పించనుంది.