డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్
డోలో-650 ట్యాబ్లెట్లను తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) కుంభకోణానికి కంపెనీ పాల్పడినట్లు ఆరోపిస్తూ, ట్రయల్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. డోలో-650 తయారీదారైన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌పై ఉద్యోగులు ఆరోగ్య బీమా స్కామ్‌కు పాల్పడినట్లు న్యాయవాది ప్రదీప్ కుమార్ ద్వివేది పిటషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన జస్టిస్ రాజ్‌బీర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఫిబ్రవరి 20కు విచారణను వాయిదా వేసింది.
30సంవత్సరాలుగా పని చేస్తున్నఉద్యోగులకు ఆరోగ్య బీమా చెల్లించలేదు: న్యాయవాది
మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నఉద్యోగులకు ఆరోగ్య బీమా చెల్లించలేదని న్యాయవాది ప్రదీప్ కుమార్ ద్వివేది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మొత్తం విలువ రూ.300కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు. డోలో-650 తయారీదారైన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌పై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. జ్వరంతో బాధపడుతున్న రోగులకు డోలో-650 టాబ్లెట్‌ను సూచించిన వైద్యులకు రూ.1,000 కోట్ల విలువైన బహుమతులను కంపెనీ అందించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై ఆదాయపు పన్ను శాఖ కూడా విచారణ ఇంకా కొనసాగుతోంది. రూ.1,000 కోట్ల కేసు కథ ముగియక ముందే, మరోసారి డోలో-650 తయారీ కంపెనీ స్కామ్ ఆరోపణల్లో చిక్కుకుంది