Allegro Micro Systems: తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న అలెగ్రో మైక్రో సిస్టమ్స్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం నెలకొనడంతో, పలు అంతర్జాతీయ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అంతర్జాతీయ సెమీకండక్టర్ల సంస్థ అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్‌లో తమ పరిశోధనాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ మేరకు,ఆ సంస్థ సీఈఓ వినీత్, ఆయన బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును కలిసి చర్చలు జరిపారు.
500 మందికి ఉద్యోగావకాశాలు
పలు ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలకు సెమీకండక్టర్లు సరఫరా చేస్తున్నామని అలెగ్రో ప్రతినిధులు మంత్రి ముందు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల సౌకర్యాలు,మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా రాష్ట్రానికి మరింత పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అలెగ్రో సంస్థ హైదరాబాద్‌లో తమ పరిశోధనాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల సుమారు 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.