
తెలంగాణలో కాంగ్రెస్-సీపీఐ చర్చలు సఫలం.. సీపీఐ, సీపీఎంలకు ఎన్ని టిక్కెట్లో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే చర్చలు ఫలవంతమైనట్లు నారాయణ చెప్పారు.
కమ్యూనిస్ట్ పార్టీలకు చెరో మూడో టిక్కెట్లు అడిగామన్నారు. ఇందుకు స్పందించిన కాంగ్రెస్ చెరో టిక్కెట్ ఇస్తామని చెప్పినట్లు సమాచారం.చివరకు సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు హస్తం పార్టీ సన్నద్ధమవుతోంది.
మునుగోడు, కొత్తగూడెం, హూస్నాబాద్, బెల్లంపల్లి, దేవరకొండ,వైరా, పినపాక సీట్లు కోసం కామ్రేడ్లు పట్టుబట్టారు. ఒకట్రెండు రోజుల్లో సీపీఎం జాతీయ నేతలతో కాంగ్రెస్ చర్చలు చేయనుంది.
details
కమ్యూనిస్టులకు టిక్కెట్లు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ తో పొత్తులు
మునుగోడు ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టులను వాడుకున్న కేసీఆర్, తర్వాత హ్యాండ్ ఇచ్చారని కామ్రెడ్లు మండిపడుతున్నారు.కేసీఆర్ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
ఉపఎన్నికలో భాగంగా సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పినట్లు విస్త్రృతంగా ప్రచారమైంది.
పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు తమకు సమాచారం అందిస్తారని వామపక్ష నేతలూ బహిరంగంగానే భావించారు.
కానీ ఎన్నికల హీట్ మొదలయ్యే నాటికి కామ్రేడ్ల పరిస్థితి తారుమారైంది. అంతలోనే కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ఆశ్చర్యపర్చారు. పార్టీ తొలి జాబితాలో వామపక్షాలకు ఒక్క సీటు కూడా కేటాయించపోవడం గమనార్హం.
కమ్యూనిస్టులు బలంగా ఉన్న స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లనే అధినేత కేసీఆర్ ప్రకటించేశారు. దీంతో పొత్తుకు తెరపడింది.