కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రం తనపై చేసిన ఆరోపణలపై లోక్‌సభలో మాట్లాడేందుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లోక్‌సభలో సీనియర్ మంత్రులు తనపై చేసిన నిరాధారమైన, అన్యాయమైన ఆరోపణలపై స్పందించడానికి అనుమతిని కోరుతూ మార్చి 17న సైతం స్పీకర్‌కు రాహుల్ లేఖ రాశారు. అయితే రాహుల్‌కు మాట్లాడే అవకాశం రాలేదు. దీంతో తాను మళ్లీ అభ్యర్థన చేస్తున్నానని, పార్లమెంటరీ ఆచరణ, లోక్‌సభ విధివిధానాలు, ప్రవర్తన నియమావళి రూల్ 357ప్రకారం తనను అనుమతించాలని రాహుల్ కోరారు. ఒక సభ్యుడు స్పీకర్ అనుమతితో సభలో ఎటువంటి ప్రశ్న లేనప్పటికీ రూల్ 357 ప్రకారం మాట్లాడవచ్చనే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
నా పరువుకు నష్టం కలిగించేలా కేంద్రం ఆరోపణలు: రాహుల్
కేంద్రం ప్రభుత్వంలోని సభ్యులు తనపై సభ లోపల, బయట అవమానకరమైన, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసినట్లు రాహుల్ గాంధీ అన్నారు. రూల్ 357 కింద వివరణ ఇచ్చుకునే హక్కును తనకు కల్పించాలని కోరారు. ఇదిలావుండగా, యూకే పర్యటనలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లిన రాహుల్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, తనతో సహా రాజకీయ నాయకులపై గూఢచర్యం జరుగుతోందని ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు.