జనసేన తీర్థం పుచ్చుకోనున్న వైకాపా నేత ఆమంచి సోదరుడు
చీరాలలో ఆమంచి బ్రదర్స్ అంటే పొలిటికల్ బ్రదర్స్ అనే పేరు ఉంది. గుంటూరు జిల్లాలోని చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్, ఆమంచి స్వాములు సోదరులు. అనూహ్యంగా స్వాములు జనసేనలో చేరనుండటంతో చీరాల పాలిటిక్స్ రసవత్తరంగా మారింది. ఈ మేరకు జనసేన అధినేక పవన్ కళ్యాణ్ సమక్షంలో జూన్ 12న పార్టీలో చేరనున్నారు. అదే రోజు సోమవారం మంగళగిరి లోని పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంలోనే జనసేన పార్టీలో చేరాలని ఆమంచి స్వాములు ఓ నిర్ణయానికి వచ్చారు. అనంతరం చీరాలలో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు.
చీరాల టూ పర్చూరుకి మార్చడం ఆమంచికి నచ్చలా
మరోవైపు అన్నవరం దర్శనం అనంతరం అక్కడ్నుంచే ఈనెల 14 నుంచి పవన్ వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. పార్టీ తరఫున చీరాలలో తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా సరే జనసేన పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తానని ఆమంచి స్వాములు ఇప్పటికే వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఆలోచనా విధానాలు, ఆయన శైలిని మెచ్చే జనసేన సైనికుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు స్వాములు పేర్కొన్నారు. చీరాల టూ పర్చూరు : సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ ను వైసీపీ అధిష్ఠానం చీరాల నియోజకవర్గం నుంచి పర్చూరుకు మార్చింది. తెదేపా ఎమ్మెల్యేగా గెలిచాక బులుగు కండువా కప్పుకున్న కరణం బలరాంకు ఆ పార్టీ ప్రాధాన్యతనిస్తూ చీరాలను కేటాయించింది. అయితే కృష్ణమోహన్ కు మాత్రం పర్చూరుకు వెళ్లడం ఇష్టం లేదని తెలుస్తోంది.
తెలుగుదేశం గెలుపుతో మారిన రాజకీయ సమీకరణలు
ఇక్కడే పొలిటికల్ స్టంట్స్ : జనసేనలో చేరితో ఒకవేళ తెలుగుదేశంతో పొత్తులు ఏర్పడితే చీరాల టిక్కెట్ ను తనకే కేటాయిస్తారన్న ఆశతో స్వాములు ఉన్నారని చర్చ సాగుతోంది. ఈ విషయంలో సోదరులిద్దరూ ముందుగానే చర్చించుకుని, పార్టీ మారుతున్నారని వినికిడి. చీరాలలో కరణం బలరాం సైకిల్ గుర్తుపై గెలిచిన తర్వాత చీరాల రాజకీయాలు మారిపోయాయి. ఎమ్మెల్యే కరణం అనూహ్యంగా వైసీపీ హైకమాండ్ కు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఆమంచికి చీరాలలో తగిన ప్రాధాన్యతను ఇవ్వట్లేదు. అందువల్ల కరణం వర్గంతో ఆమంచికి విభేదాలు ఏర్పాడ్డాయి. ఈ క్రమంలో ఆమంచి వైకాపా కార్యక్రమాలకు దూరం దూరంగా ఉంటున్నారు. వైసీపీ పెద్దలు చీరాలపై దృష్టిసారించి దాన్ని కరణంకు అప్పగించి, పర్చూరును ఆమంచి కృష్ణమోహన్ కి కట్టబెట్టింది.