అమరరాజా నుంచి లూలూ దాకా.. ఏపీ నుంచి తెలంగాణకు మళ్లిన పెట్టుబడుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ నుంచి మెగా కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ మేరకు అమరరాజా, లూలూ లాంటి అతిపెద్ద పెట్టుబడులు కలిగిన సంస్థలు ఏపీని కాదని తెలంగాణకు క్యూ కట్టాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాల కారణంగానే ఈ పెట్టుబడులు తరలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. తాజాగా అబుదాబికి చెందిన లూలూ గ్రూప్ బుధవారం హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ మాల్‌కు ప్రారంభోత్సవం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి సదరు కంపెనీ నిష్క్రమించిన 4 సంవత్సరాల తర్వాత ఇలా ఓ మెగా మాల్ ను ప్రారంభించడం గమనార్హం.
భూ కేటాయింపులను రద్దు చేసిన జగన్ సర్కార్
ఇప్పటికే ఉన్న కాంప్లెక్స్‌ను రూ. 300 కోట్లతో లూలూ పునరుద్ధరించింది. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలోని ఇతర ప్రాజెక్టుల కోసం రూ. 3,000 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. చంద్రబాబు హయాంలో రూ.2,200 కోట్లతో విశాఖపట్నంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు గతంలో ఏపీ ప్రభుత్వంతో లూలూ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం విశాఖలో హైపర్ మార్కెట్ నిర్మాణం కోసం భూమి కూడా కేటాయించింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్, ఆయా భూ కేటాయింపులను రద్దు చేసింది. దీంతో కోయంబత్తూరులో రూ.3,000 కోట్ల పెట్టుబడి, హైదరాబాద్‌లో కూకట్‌పల్లి వద్ద రూ.3,500 కోట్లతో మెగా హైపర్ మార్కెట్ ఏర్పాటు చేసింది.
కోయంబత్తూరులో జులైలోనే ప్రారంభమైన లులూ మాల్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో సెప్టెంబరు 27న, లులూ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మరోవైపు కోయంబత్తూరులో జులైలోనే లులూ మాల్ మొదలైంది. వీటి కారణంగా ప్రత్యక్షంగా దాదాపుగా 3,000 నుంచి 4,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మరో 5 నుంచి 6 వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుంది. అమరరాజా టు లూలూ : పెట్టుబడిదారులు ఆంధ్రా నుంచి తెలంగాణకు ఎలా మళ్లుతున్నారంటూ 'ది ప్రింట్' ఇంగ్లీష్ మీడియా కథనాన్ని నారా లోకేష్ ట్వీట్ చేశారు. అంతకుముందు నారా బ్రాహ్మిణి సైతం ట్వీట్ చేసి ప్రశ్నల వర్షం కురిపించడం గమనార్హం. ఇన్వెస్టర్లను, అమరరాజా, లూలూ లాంటి కంపెనీలను సీఎం జగన్ పుష్ అవుట్, పుల్ ఇన్ విధానంతో ఆంధ్రా నుంచి తెలంగాణాకు మళ్లిస్తున్నాయన్నారు.