Page Loader
తెలంగాణలో రూ.3500 కోట్లతో మెగా పెట్టుబడులు.. త్వరలోనే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం : లులూ సంస్థ
రూ.3500 కోట్లతో భారీ పెట్టుబడులు

తెలంగాణలో రూ.3500 కోట్లతో మెగా పెట్టుబడులు.. త్వరలోనే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం : లులూ సంస్థ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 26, 2023
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎగుమతుల రంగాల్లో మెగా పెట్టుబడికి తెలంగాణ వేదిక కానుంది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ ముందుకొచ్చింది. దాదాపు రూ. 3,500 కోట్ల భారీ పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టనున్నామని బేగంపేటలోని ఐటీసీ హోటల్ లో లులూ గ్రూప్‌ ఛైర్మన్ యూసఫ్‌ అలీ ప్రకటించారు.ఈ మేరకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ను వెల్లడించారు. తాజా పెట్టుబడులతో హైదరాబాద్ పరిసరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎక్స్‌పోర్ట్ ల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు యూసఫ్ అలీ తెలిపారు. రూ.300 కోట్ల పెట్టుబడితో నగరంలో నిర్మితమవుతున్న లులూ షాపింగ్‌ మాల్‌ నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు చర్యలను వేగవంతం చేశామని ఛైర్మన్ వివరించారు.

DETAILS

ఆగస్టులో గానీ సెప్టెంబర్‌లో గానీ మాల్ కార్యకలాపాలు ప్రారంభం : ఛైర్మన్ అలీ

మరో వైపు లులూ మాల్‌కు సంబంధించి దాదాపు 80 శాతానికిపైగా నిర్మాణ పనులు పూర్తైయ్యాయని లులూ గ్రూప్‌ ఛైర్మన్ యూసఫ్‌ అలీ అన్నారు. అయితే త్వరలోనే షాపింగ్‌ మాల్‌ నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నామన్నారు. వచ్చే ఆగస్టులో గానీ సెప్టెంబర్‌లో గానీ మాల్ కార్యకలాపాలను సైతం ప్రారంభించబోతున్నామని యూసఫ్ అలీ చెప్పారు. దేశంలోని అతిపెద్ద షాపింగ్‌ మాల్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందిన లులూ గ్రూప్‌ సంస్థ హైదరాబాద్ రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. లులూ సంస్థ పెట్టుబడులతో తెలంగాణలో పర్యాటకం ఊపుందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో వైపు ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు తెలంగాణలోనే ఉందని గుర్తు చేశారు. ఈ మేరకు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోందన్నారు.