Page Loader
500 వాహనాల భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..దారిపొడవునా ఫ్లెక్సీల హోరు
500 వాహనాల భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..దారిపొడవునా ఫ్లెక్సీల హోరు

500 వాహనాల భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..దారిపొడవునా ఫ్లెక్సీల హోరు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 26, 2023
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ చేపట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగానే నేటి నుంచి 2 రోజుల పాటు మరాఠీ గడ్డపై పర్యటించనున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రగతి భవన్ నుంచి పండరీపురానికి 500 వాహనాల భారీ కాన్వాయ్ తో బయల్దేరనున్నారు. అయితే 2 వేల మంది పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ అధినేత వెంట మహారాష్ట్రకు వెళ్లనున్నారు. 300 కిలోమీటర్ల మేర భారీ కాన్వాయ్ తో ప్రయాణించి, మహారాష్ట్రలోని కాంగ్రెస్, ఎన్సీపీ నేతలను ఆకర్షించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 65వ జాతీయ రహదారి పొడవునా స్వాగత తోరణాలు, పార్టీ ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ భారీగా సిద్ధం చేశారు.

DETAILS

పర్యటనలో భాగంగా తెలంగాణ చేనేత వలస కార్మికులతో సమావేశం

తొలుత హైదరాబాద్‌ నుంచి ఇవాళ ఉదయం రోడ్డు మార్గాన బయలుదేరతారు. అదే రోజు సాయంత్రానికి సోలాపూర్‌ చేరుకుంటారు. ఆ రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఇందులో భాగంగా సోలాపూర్‌లోని పలువురు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలను, తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కార్మిక కుటుంబాలను కలవనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం ఉదయం పండరిపురంలోని విఠోభారుక్మిణి మందిర్‌లో పూజలు చేయనున్నారు. సోలాపూర్‌ ప్రముఖ నేత భగీరథ్‌ బాల్కే సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి రానున్నారు. మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ లు మహా నేతలతో సమన్వయం చేసుకుంటూ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పర్యటన ముగిశాక దారాశివ్ విమనాశ్రయంలో స్పెషల్ ఫ్లైట్ ద్వారా సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగుపయనమవనున్నారు.