Chandrababu: భవిష్యత్తులో డ్రోన్ ఓ గేమ్ చేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ ఛేంజర్‌గా మారనున్నట్లు చెప్పారు. ఇటీవల విజయవాడలో వచ్చిన వరద సమయంలో డ్రోన్లను ఉపయోగించి ఆహారం, తాగునీరు అందించినట్లు ఆయన తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన 'అమరావతి డ్రోన్ సమ్మిట్' ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సీఎం, ఐటీ,నాలెడ్జ్ ఎకానమీ రంగాలలో భారతీయులు అత్యంత సమర్థులని ప్రశంసించారు. 1995లో తొలిసారిగా సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి తన కృషిని గుర్తుచేశారు. ఆ సమయంలో పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించామన్నారు. అమెరికాలో 15 రోజుల పాటు అనేక సంస్థల ప్రతినిధులను కలిసిన అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
భవిష్యత్తులో దేశానికి లేదా కంపెనీకి డేటా కీలకం
భారతదేశంలో నివాసానికి అనుకూలమైన నగరాల్లో హైదరాబాద్‌నే బెస్ట్ సిటీగా ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న భారత ఐటీ నిపుణుల్లో 30% తెలుగువారు ఉన్నారని ఆయన చెప్పారు. "ప్రస్తుతం, నిజమైన సంపద డేటా. భవిష్యత్తులో దేశానికి లేదా కంపెనీకి ఇది కీలకం. డేటాకు ఏఐను అనుసంధానిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. విజయవాడలో జరిగిన వరదల్లో, డ్రోన్లను ఉపయోగించి ఆహారం,తాగునీరు అందించాం. వ్యవసాయానికి,మౌలిక వసతుల రంగంలో డ్రోన్ల పాత్ర కీలకం.నగరాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి కూడా ఉపయోగించవచ్చు.
రోగులు ఇంటి దగ్గరే చికిత్స
భవిష్యత్తులో వైద్య రంగంలో పెద్ద మార్పులు రానున్నాయి. రోగులు ఇంటి దగ్గరే చికిత్స పొందగలరు. కొన్ని దేశాలు యుద్ధాల్లో డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి,కానీ మేం అభివృద్ధి కోసం ఉపయోగిస్తాం. శాంతి,భద్రతను కాపాడేందుకు కూడా వీటిని వినియోగిస్తాం.పోలీస్ విభాగంలో విస్తృతంగా డ్రోన్లను ఉపయోగించడానికి కృషి చేస్తాం. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచి వారికి చెక్ పెడతాం" అని చంద్రబాబు అన్నారు.