Amaravati: రెండు ప్యాకేజీలుగానే అమరావతి ఓఆర్‌ఆర్.. బీవోటీ విధానంలో నిర్మాణం
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాజధాని అమరావతితోపాటు విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ నిర్మించనున్న ఈ భారీ రహదారి ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు నాలుగు ప్యాకేజీలుగా నిర్మించేందుకు టెండర్లు పిలిచినప్పటికీ.. తాజాగా ఆ విధానాన్ని మార్చింది. అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి అనుసరించనున్న విధానంలోనూ మార్పులు చేసింది. తొలుత హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) పద్ధతిలో నిర్మించాలని భావించగా.. ఇప్పుడు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) విధానాన్ని ఎంచుకుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ)ఆమోదం తెలిపింది. దీంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు టెండర్ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.
వివరాలు
పెరగనున్న టెండర్ల గడువు
అమరావతి ఓఆర్‌ఆర్‌ను ఆరు వరుసలతో, యాక్సెస్ కంట్రోల్ విధానంలో నిర్మించనున్నారు.
ఈ రహదారి మొత్తం 189.93 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనికి అదనంగా నారాకోడూరు సమీపం నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.2 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు.
దీంతో మొత్తం ప్రాజెక్టు పొడవు 195.13 కిలోమీటర్లకు చేరుతుంది. ఈ పనులకు గత నెల 2న ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది.
మొదట ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీ 27.93 కిలోమీటర్లు,రెండో ప్యాకేజీ 56 కిలోమీటర్లు,మూడో ప్యాకేజీ 55.7 కిలోమీటర్లు, నాలుగో ప్యాకేజీ 55.5 కిలోమీటర్లుగా నిర్ణయించారు.
అయితే తాజాగా మొత్తం ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించేలా టెండర్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు.
వివరాలు
కృష్ణా నదిపై రెండు కీలక వంతెనల నిర్మాణం
మచిలీపట్నం-విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)పై ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలో ఓఆర్‌ఆర్ ప్రారంభమవుతుంది.
అక్కడి నుంచి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చలివేంద్రపాలెం సమీపంలో తిరిగి ఎన్‌హెచ్-65ను దాటుతుంది.
ఈ మార్గం వరకు 86 కిలోమీటర్ల మేర ఒక ప్యాకేజీగా పనులు చేపట్టనున్నారు. మిగిలిన 109.13 కిలోమీటర్లను రెండో ప్యాకేజీగా విభజించనున్నారు.
రెండో ప్యాకేజీలో కృష్ణా నదిపై రెండు కీలక వంతెనలను నిర్మించాల్సి ఉంటుంది.
ఇప్పటికే నాలుగు ప్యాకేజీలుగా పిలిచిన టెండర్లకు ఈ నెల 18తో గడువు ముగియనుంది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో గడువును పొడిగించనున్నారు.
రెండు ప్యాకేజీలకు అనుగుణంగా టెండర్ నోటిఫికేషన్‌లోనూ మార్పులు చేయనున్నారు.
వివరాలు
హ్యామ్‌కు బదులు బీవోటీ విధానం
ఇప్పటివరకు అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) విధానంలో చేపట్టాలని భావించారు.
తాజా నిర్ణయం ప్రకారం బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) పద్ధతిలో నిర్మించనున్నారు.
ఈ విధానంలో ఒక్కో ప్యాకేజీని దక్కించుకున్న గుత్తేదారు సంస్థ తన సొంత నిధులతో రహదారిని నిర్మించాలి.
అనంతరం నిర్ణీత కాలం పాటు దాని నిర్వహణ బాధ్యతలను కూడా చేపట్టాలి.
ఈ సమయంలో గుత్తేదారు సంస్థే వాహనదారుల నుంచి టోల్ వసూలు చేసుకుంటుంది.
ఒప్పందంలో నిర్ణయించిన కాలపరిమితి సాధారణంగా 15 నుంచి 20 ఏళ్ల వరకు ఉండవచ్చు.
ఆ గడువు ముగిసిన తర్వాత నిర్మించిన రహదారిని ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించాల్సి ఉంటుంది.
వివరాలు
హ్యామ్‌కు బదులు బీవోటీ విధానం
బీవోటీ విధానంలో రెండు రకాలున్నాయి. మొదటిది బీవోటీ-టోల్. ఇందులో గుత్తేదారు సంస్థ రహదారిపై టోల్ వసూలు చేయడం ద్వారా నిర్మాణానికి పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవాలి.
రెండోది బీవోటీ-యాన్యుటీ. ఇందులో నిర్దేశించిన మొత్తంలో టోల్ ఆదాయం రాకపోతే.. లోటుగా ఉన్న మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా గుత్తేదారు సంస్థకు చెల్లిస్తుంది.
ఈ రెండు విధానాల్లో దేనిని అమలు చేయాలన్నది కేంద్ర క్యాబినెట్ నిర్ణయించనుంది.
ఇప్పటికే పీపీపీఏసీ ఆమోదం లభించడంతో.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందడం మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.
ఈ ఆమోదం కూడా లభిస్తే ప్రాజెక్టుకు అధికారికంగా మంజూరు లభించనుంది.
దీంతో ఒకవైపు భూసేకరణ, మరోవైపు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.