Loading...
Amaravati: అమరావతిలో అత్యాధునిక మీడియా సిటీ.. రూ.5 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
అమరావతిలో అత్యాధునిక మీడియా సిటీ.. రూ.5 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

Amaravati: అమరావతిలో అత్యాధునిక మీడియా సిటీ.. రూ.5 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రత్యేక ఆకర్షణ రానుంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) రంగాలను రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రంగాల ద్వారా రూ.5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 2026-31 కాలానికి సంబంధించిన ఏవీజీసీ-ఎక్స్ఆర్ విధానాన్ని రూపొందించింది. ఈ పాలసీలో భాగంగా అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు కలిగిన మీడియా సిటీని, ప్రత్యేక ఏవీజీసీ-ఎక్స్ఆర్ పార్కును ఏర్పాటు చేయనుంది.

వివరాలు 

ఐదేళ్ల పాటు ఈ విధానం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 10న నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నూతన విధానానికి ఆమోదం లభించింది.

తాజాగా దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

2026 నుంచి 2031 వరకు ఐదేళ్ల పాటు ఈ విధానం అమల్లో ఉండనుంది.

ఇందులో భాగంగా ఐదు ప్రధాన (యాంకర్) సంస్థలతో పాటు మరో 100 కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడులు రాబట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

అమరావతిలో ఏర్పాటు చేయనున్న మీడియా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి బాధ్యతలను ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ)కు అప్పగించింది.

వివరాలు 

పరిశ్రమలకు భారీ రాయితీలు..

ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది.

ఈ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అయ్యే వ్యయంలో 50 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది.

ఈ మొత్తం గరిష్ఠంగా రూ.2 కోట్లకు పరిమితం కానుంది. అలాగే ఏవీజీసీ-ఎక్స్ఆర్ పార్కుల అభివృద్ధికి ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం సబ్సిడీ అందించనుంది.

దీనికి గరిష్ఠ పరిమితిని రూ.50 కోట్లుగా నిర్ణయించింది. వీటితో పాటు ఐదేళ్ల పాటు రాష్ట్ర జీఎస్టీని 100 శాతం తిరిగి చెల్లించనుంది. స్టాంప్ డ్యూటీ నుంచి కూడా మినహాయింపు కల్పించనుంది.

ADVERTISEMENT

వివరాలు 

మెగా ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు..

పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది.

కనీసం రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 200 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థలను మెగా ప్రాజెక్టులుగా గుర్తించనుంది.

అలాంటి సంస్థలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందించనుంది.

తద్వారా పెద్ద కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షించి, ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

200 ఎకరాల్లో ప్రత్యేక పార్కు..

అమరావతిలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ఏవీజీసీ-ఎక్స్ఆర్ పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇప్పటికే రోబోటిక్స్, సెమీకండక్టర్ రంగాలకు సంబంధించి విధానాలను ఆమోదించిన ప్రభుత్వం.. తాజాగా ఏవీజీసీ-ఎక్స్ఆర్ పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక రంగాల అభివృద్ధి, పరిశోధన, నవకల్పనలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

మీడియా సిటీ, ప్రత్యేక పార్కు ఏర్పాటు ద్వారా అమరావతిని సాంకేతిక, సృజనాత్మక పరిశ్రమలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT