Amarawati: అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి వేగంగా అడుగులు.. క్షేత్రస్థాయిలో మరోసారి ఎలైన్‌మెంట్ పరిశీలన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి గట్టి అడుగులు పడుతున్నాయి.తుది ఎలైన్‌మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణ విషయాలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక ఏడాదిలో ప్రాజెక్టును ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.2018లో ఎలైన్‌మెంట్ ఖరారు కాగా, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్‌ఆర్ ప్రాజెక్టును వాయిదా వేశారు. అయితే, చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దిల్లీ వెళ్లి కేంద్రం నుంచి ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం పొందేలా చేశారు. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు ఓఆర్‌ఆర్ నిర్మాణ కార్యాచరణను పునఃప్రారంభించాలని ఆదేశాలు వచ్చాయి 189 కి.మీ పొడవుతో ఉండే ఈ రహదారి ఎలైన్‌మెంట్,డీపీఆర్ పనులను గతంలో ఆర్వీ అసోసియేట్స్ అనే సలహా సంస్థ చేపట్టింది.
భూసేకరణ భారముండదు
కానీ, 2019 నుంచి ఈ పనులు నిలిచిపోవడంతో ఆర్వీ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగాలని కోరింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐపై నిర్ణయం తీసుకోకపోయినా, ఇటీవల కేంద్రం ఓఆర్‌ఆర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దాంతో ఆర్వీ సంస్థను కొనసాగించేలా అనుమతులు మంజూరయ్యాయి.ఇప్పుడు ఆ సంస్థతో ఎన్‌హెచ్‌ఏఐ సప్లిమెంటరీ ఒప్పందాన్ని ఈ వారంలో కుదుర్చుకోనుంది. 2018 నాటి అంచనా ప్రకారం, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)నిర్మాణం కోసం రూ.17,761 కోట్ల వ్యయం అవుతుందని,దీనికి అవసరమైన 3,404హెక్టార్ల భూమి భూసేకరణకు రూ.4,198 కోట్లు ఖర్చవుతాయని భావించారు. తాజా అంచనా ప్రకారం, ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ. 20 వేల కోట్లకు చేరుకోవడంతో పాటు భూసేకరణకు సుమారు రూ. 5 వేల కోట్లు ఉండవచ్చని భావిస్తున్నారు.
తుది ఎలైన్‌మెంట్ ఖరారు కోసం పరిశీలన
గతంలో భూసేకరణ వ్యయాన్ని రాష్ట్రం భరించాలని కేంద్రం షరతు పెట్టగా, ఇప్పుడు కేంద్రం భూసేకరణ సహా మొత్తం వ్యయాన్ని భరించేందుకు అంగీకరించింది. దీంతో ప్రాజెక్టు వేగంగా పూర్తవడానికి అవకాశం పెరిగింది. 2018 నాటి ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్ మొత్తం 189 కిలోమీటర్లది. అప్పటి నుంచి ఆరేళ్లకు పైగా గడవడంతో, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు మారిపోవడం జరిగింది. అందువల్ల, ప్రస్తుత అధికారులు కొత్తగా ఎలైన్‌మెంట్‌ను క్షేత్రస్థాయిలో సమీక్షించాలని నిర్ణయించారు. ఈ పరిశీలనలో హైటెన్షన్ విద్యుత్ లైన్లు, పంట కాల్వలు, చెరువులు వంటి వాటి ఉనికిని పరిశీలిస్తారు. ఈ సమీక్ష అనంతరం, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తుది ఎలైన్‌మెంట్‌ను ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులకు పంపుతారు.
ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఏ పథకంలో చేరుస్తుందో..
ఇంకా, ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఏ పథకంలో చేర్చుతుందో అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం ప్రాజెక్టుల స్థాయి ఆధారంగా కేంద్రం పలు పథకాల్లో వాటిని చేర్చుతూ, అవసరమైన నిధులు కేటాయిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ఏ పథకాన్ని ఎంపిక చేస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు తెలిపాయి.