Amit Shah: ఉగ్రవాదాన్ని సమూలంగా ఏరివేయడానికి గొప్ప వ్యూహంతో ముందుకెళ్తున్నాం: అమిత్ షా
ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు మోదీ సర్కార్ ఎంతగానో కృషి చేస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. దీనికోసం ప్రత్యేక వ్యూహం రూపొందించుకుని ముందుకెళ్తుందని తెలిపారు. 'యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్-2024' ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ కాలంలో సరిహద్దుల వద్ద అంతర్గత భద్రత కోసం 36 వేల మందికి పైగా పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను కోల్పోయారు. దేశం తరపున వీరందరికీ నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 'జీరో టాలరెన్స్' విధానంతో ముందుకెళ్తోంది. ఈ విధానాన్ని ప్రస్తుతం ప్రపంచ దేశాలు కూడా అనుసరిస్తున్నాయి," అని అమిత్ షా అన్నారు.
యువ అధికారులకు అత్యున్నత సాంకేతిక నైపుణ్యం
"ఉగ్రవాదంపై పోరాడేందుకు మేము బలమైన వ్యవస్థను ఏర్పాటుచేశాం. ఉగ్రవాదులు ఏ విధంగా దాడి చేసినా, దానికి మనం ప్రతిస్పందించాల్సి ఉంటుంది. అందుకు యువ అధికారులకు అత్యున్నత సాంకేతిక నైపుణ్యం అవసరం. భవిష్యత్తులో వారి శిక్షణలో దీనిని భాగం చేస్తాం. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విధంగా కేంద్ర మంత్రిత్వ శాఖ మరింత బలమైన ఉగ్రవాద నిరోధక విధానాన్ని తీసుకొస్తోంది," అని అమిత్ షా తెలిపారు.