మణిపూర్‌లో అమిత్ షా; ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్
మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో పరిస్థితులపై చర్చించడానికి సోమవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, మంత్రులతో సమావేశమయ్యారు. జాతుల మధ్య నెలకొన్న సంఘర్షణకు పరిష్కారాన్ని కనుగొనేందుకు, ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ఏం చేయాలనే దానిపై మంగళవారం, బుధవారం కూడా పలు ధఫాలు మణిపూర్ ప్రభత్వ ప్రతినిధులతో అమిత్ షా సమావేశాలను నిర్వహించనున్నారు. ఎస్టీ హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌ను నిరసిస్తూ మే 3న కొండ జిల్లాల్లో 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించిన తర్వాత మణిపూర్‌లో జాతి ఘర్షణలు మొదలయ్యాయి. 300మందికి పైగా గాయపడడంతో పాటు 110మంది ప్రాణాలు కోల్పోయారు.
మిలిటెంట్లపై భద్రతా దళాల ఉక్కుపాదం
మణిపూర్ జనాభాలో మైతీలు 53 శాతం ఉన్నారు. ఇంఫాల్ లోయలో వీరు ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులు నాగాలు, కుకీలు జనాభాలో మరో 40 శాతం ఉన్నారు. వీరు కొండ జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుంచి తమను సాగనంపేందుకే మైతీలు ఎస్టీ హోదాను కోరుతున్నారని కుకీ తెగ వ్యతిరేకించిన నేపథ్యంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో కొందరు మిలిటెంట్లు భద్రతా బలగాల ఆయుధాలను స్వాధీనం చేసుకొని పౌరులపై కాల్పులు జరపడంతో రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40మంది మిలిటెంట్లు హతమయ్యారు.
38 ఉద్రిక్త ప్రాంతాలను గుర్తించాం: ముఖ్యమంత్రి
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న హింసాకాండను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలను బుధవారం మధ్యాహ్నం అమిత్ షా విలేకరుల సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. అతను గురువారం ఉదయం ఇంఫాల్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రజలు కృషి చేయాలని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కోరారు. ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడిన సిఎం బిరెన్, మణిపూర్‌లో 38 ఉద్రిక్త ప్రాంతాలను గుర్తించామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్ఎ) సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మే 31 వరకు పొడిగించింది.
మణిపూర్‌లో 10వేల మంది బలగాల మోహరింపు
తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌లో మంగళవారం ఉదయం కర్ఫ్యూను సడలించారు. ఉదయం 5గంటల నుంచి 11గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల జిల్లాల్లో ఆర్మీ, పారామిలిటరీ సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని ఒక అధికారి తెలిపారు. ఆర్మీ ఆపరేషన్ అక్రమ ఆయుధ నిల్వలను జప్తు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంఫాల్ లోయలో ఆదివారం కాల్పులు, ఘర్షణలు చోటుచేసుకున్న తర్వాత అనేక మంది వ్యక్తులను ఆయుధాలతో అదుపులోకి తీసుకున్నట్లు రక్షణ దళాల ప్రతినిధి తెలిపారు. మణిపూర్‌లో సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇతర పారామిలిటరీ బలగాలతో పాటు మొత్తం 10,000 మందికి పైగా సిబ్బందిని మోహరించింది.