మున్నంగి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..16 మంది కార్మికులకు అస్వస్థత,ఆస్పత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ లోని సీ ఫుడ్స్ పరిశ్రమలో విష వాయువు లీకైంది. ప్రకాశం జిల్లాలోని వావిలేటిపాడులోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. చేపలను ప్రాసెసింగ్ చేస్తున్న సమయంలో అమ్మోనియం గ్యాస్ లీకేజీకి గురైంది. ఈ విష వాయువును పీల్చిన సిబ్బంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అమ్మోనియం గ్యాస్ కారణంగా 16 మంది కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ క్రమంలో బాధితులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించామని స్పష్టం చేశారు. అనంతరం కార్మికులకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ లో చేర్పించామన్నారు.
ఒడిశాకు చెందిన కార్మికులకు తీవ్ర అస్వస్థత
బాధిత కార్మికులంతా ఒడిశాకు చెందిన వారేనని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రస్తుతం కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలేమీ తెలియరాలేదు. బాధిత కార్మికులందరినీ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. లీకేజీకి ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మున్నంగి సీ ఫుడ్స్ లో విష వాయువు లీకేజీలో కుట్ర కోణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో గ్యాస్ లీకేజీ ఘటనలు చోటు చేసుకోవడం కలవరపెట్టే అంశంగా మారింది.