Amritsar: పంజాబ్‌లో టాప్ పోలీస్ అధికారికి బదిలీ.. పంజాబ్ సర్కార్‌పై బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలివే..
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్‌లోని అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గుర్‌ప్రీత్ సింగ్ భుల్లర్ బదిలీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్ర మాడ్యూళ్లపై అమృత్‌సర్ పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు ప్రకటించిన కొద్ది రోజులకే ఆయనను బదిలీ చేయడం పలు ప్రశ్నలకు దారితీసింది. ముఖ్యంగా ఈ బదిలీ జరిగిన సమయంపై బీజేపీతో పాటు ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల అమృత్‌సర్ పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.వీరిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మూడు పిస్టళ్లు,తొమ్మిది సజీవ తూటాలు,నాలుగు పెట్రోల్ బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
వివరాలు
భుల్లర్ వ్యాఖ్యలు.. ప్రభుత్వ వివరణ
విదేశాల్లో ఉన్న ఐఎస్ఐ హ్యాండ్లర్ల సూచనల మేరకు నిందితులు పనిచేస్తూ భద్రతా కేంద్రాలపై నిఘా నిర్వహించినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.
ఆగస్టు 4న నిర్వహించిన మీడియా సమావేశంలో గుర్‌ప్రీత్ సింగ్ భుల్లర్ మాట్లాడుతూ, అరెస్టైన కొందరు నిందితులు జంతర్ మంతర్‌కు వెళ్లి అక్కడ రెక్కీ నిర్వహించారని, నిరసనకారులపై పెట్రోల్ బాంబులతో దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో బయటపడిందని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే అనంతరం పంజాబ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్నవారే నిందితులని లేదా ఆ నిరసనకారులకు ఉగ్ర మాడ్యూళ్లతో సంబంధాలున్నాయని పోలీస్ కమిషనర్ ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది.
వివరాలు
భుల్లర్ బదిలీపై రాజకీయ విమర్శలు
భుల్లర్ వ్యాఖ్యలను కొంతమంది ఎంపిక చేసిన భాగాలనే ప్రచారం చేయడంతో ప్రజల్లో తప్పుదారి పట్టించే అభిప్రాయం ఏర్పడిందని ప్రభుత్వం తెలిపింది.
ఈ వివరణ వచ్చిన కొద్దికాలానికే గుర్‌ప్రీత్ సింగ్ భుల్లర్ బదిలీ కావడంతో, జంతర్ మంతర్ వ్యాఖ్యల వివాదమే దీనికి కారణమా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఆయన బదిలీకి ఆ వ్యాఖ్యలే కారణమని ప్రభుత్వం లేదా అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది.
గుర్‌ప్రీత్ సింగ్ భుల్లర్ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు గతంలోనే ఆరోపించాయి.
ఈ నేపథ్యంలో ఆయన బదిలీపై రాజకీయ విమర్శలు మరింత ముదిరాయి.
వివరాలు
భుల్లర్ బదిలీపై బిట్టూ సంచలన వ్యాఖ్యలు
మాజీ కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ స్పందిస్తూ, "గుర్‌ప్రీత్ భుల్లర్ బదిలీ జరిగిన సమయం సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. జంతర్ మంతర్ ఘటనపై ఆయన వెల్లడించిన వివరాలు అరవింద్ కేజ్రీవాల్‌కు అసౌకర్యంగా మారాయా?" అంటూ ప్రశ్నించారు.