Karnataka covid guidelines:మాస్క్,వ్యాక్సిన్,ఐసోలేషన్: JN.1 వేరియంట్ పై కర్ణాటక కోవిడ్ మార్గదర్శకాలు
కర్ణాటక రాష్ట్రంలో JN.1 కరోనా వైరస్ వేరియంట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో,కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, సోకిన రోగులు హోం ఐసోలేషన్ లో ఉండాలని,కోవిడ్ వైరస్ లక్షణాలతో ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ ఉపసంఘం, వృద్ధులు, ఇతర రోగాలు ఉన్నవారు కూడా 'ముందుజాగ్రత్త వ్యాక్సిన్' వేయించుకోవాలని సూచించింది. దీన్ని సులభతరం చేసేందుకు కేంద్రం నుంచి 30,000 డోసుల కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నూతన సంవత్సర వేడుకలు,సమావేశాలపై ఎలాంటి ఆంక్షలు లేవు
అయితే నూతన సంవత్సర వేడుకలు,సమావేశాలపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సవివరమైన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని సూచించారు,ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు,ఇతర రోగాలు ఉన్నవారు తప్పనిసరి మాస్క్ ధరించాలన్నారు. పిల్లలు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని పాఠశాలకు పంపకూడదని ఆరోగ్య మంత్రిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. కోవిడ్ సోకిన వ్యక్తులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని పక్షంలో వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని మంత్రి ఉద్ఘాటించారు.
JN.1 వేరియంట్‌లో 34 కేసులు
హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాలలో పని చేస్తున్న వారందరికీ ఒక వారం తప్పనిసరి క్యాజువల్ సెలవు ఇవ్వాలి, ఆసుపత్రిలో చేరిన వారికి ఆసుపత్రిలో చేరే వ్యవధికి ప్రత్యేక సెలవు ఇవ్వాలని మార్గదర్శకాలు చేస్తామని మంత్రి చెప్పారు. తాజా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో మూడు మరణాలతో సహా JN.1 వేరియంట్‌లో 34 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన 69 JN.1 కేసులలో, కర్ణాటకలో అత్యధికం. కేసులు ఇంత ఎక్కువ ఉన్నా, ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఉద్ఘాటించారు. ఆక్సిజన్, పడకలను సిద్ధం చేశామని మంత్రి చెప్పారు. అదనంగా, రాష్ట్రంలో డెత్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.
ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం, రాష్ట్రంలోని కరోనావైరస్ JN.1 సబ్-వేరియంట్‌కు సంబంధించి పరిస్థితిని అంచనా వేయడానికి ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో, 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఇంటి లోపల , ఆరుబయట మాస్క్‌లను ఉపయోగించాలని ఆయన అధికారులను ఆదేశించారు.