Andhra Pradesh: ఏపీలో చిన్నారుల్లో 57.5 శాతం మందికి రక్తహీనత.. దేశంలోనే అత్యధికం.. ఐసీఎంఆర్-నిన్ సర్వేలో వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులు, మహిళలు, వృద్ధుల్లో రక్తహీనత సమస్య ఆందోళనకరంగా ఉన్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (నిన్) నిర్వహించిన సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో ఏడాది నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల్లో 57.5 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇదే వయసు పిల్లల్లో రక్తహీనత సగటు 41.8 శాతంగా ఉండగా.. ఏపీలో ఈ సంఖ్య అత్యధికంగా నమోదైంది. 2023-25 మధ్యకాలంలో జనాభా ఆరోగ్యం, శారీరక శ్రమ, ఆహారపు అలవాట్లు, శరీర కొలతలకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు నిర్వహించిన 'సంపద' సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆరోగ్య పరిశోధన విభాగం మంగళవారం ఈ సర్వేకు సంబంధించిన ఫ్యాక్ట్‌షీట్‌ను విడుదల చేసింది.
వివరాలు
రక్తహీనత శాతం జాతీయ సగటు కంటే ఎక్కువ
దేశవ్యాప్తంగా 132 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. 81 వేలకుపైగా కుటుంబాలకు చెందిన సుమారు 2 లక్షల మందిని కలిసి వివరాలు సేకరించారు.
అంతేకాకుండా 1.7 లక్షలకుపైగా రక్త నమూనాలను పరీక్షించి వివిధ వయసుల వారిలో రక్తహీనత స్థాయులను అంచనా వేశారు.
ఈ పరిశీలనలో ఏపీలోని పలు వయసుల వారిలో రక్తహీనత శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
చిన్నారుల్లో పరిస్థితి ఆందోళనకరం
2023-25 మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం.. ఏపీలో ఏడాది నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల్లో 57.5శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
ఈ జాబితాలో గుజరాత్ 56.5 శాతం,ఛత్తీస్‌గఢ్ 55.6 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఐదు నుంచి తొమ్మిదేళ్ల వయసున్న పిల్లల్లోనూ రాష్ట్రంలో 32శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు తేలింది.
దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లల్లో సగటు 31.3 శాతంగా నమోదైంది.
10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న కౌమార దశ బాలికల్లో 51.9 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వే గుర్తించింది.
జాతీయ స్థాయిలో ఈ సంఖ్య 46.3 శాతంగా ఉంది. ఇదే వయసు బాలురలో రాష్ట్రంలో 26.9 శాతం మందికి రక్తహీనత ఉండగా.. దేశవ్యాప్తంగా సగటు 22.8 శాతంగా నమోదైంది.
వివరాలు
మహిళల్లోనూ జాతీయ సగటు కంటే ఎక్కువ
రాష్ట్రంలోని మహిళల్లో రక్తహీనత సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్లు సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 68.5శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు.
దేశవ్యాప్తంగా ఇదే వయసు మహిళల్లో సగటు 55.9శాతమే. అలాగే 20 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న,గర్భిణులు లేదా పాలిచ్చే తల్లులు కాని మహిళల్లో 68.2శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
ఈ వర్గంలో జాతీయ సగటు 54.8 శాతంగా ఉంది. ఇదే సమయంలో 20 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో రాష్ట్రంలో 21.3 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు తేలింది.
అయితే జాతీయ సగటు 22 శాతంగా ఉండటంతో ఈ విషయంలో ఏపీ కొంత మెరుగైన స్థితిలో ఉంది.
వివరాలు
వృద్ధ మహిళల్లో 81.7 శాతం మందికి..
60 ఏళ్లు దాటిన మహిళల్లో రక్తహీనత సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
రాష్ట్రంలో ఈ వయసు మహిళల్లో ఏకంగా 81.7 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఇదే వయసు మహిళల్లో సగటు 55.7 శాతంగా ఉంది. అంటే ఏపీలో ఈ సమస్య జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా నమోదైంది.
60 ఏళ్లు పైబడిన పురుషుల్లోనూ 62.5 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు.
జాతీయ స్థాయిలో ఈ వర్గం పురుషుల్లో సగటు 44.7 శాతమే.
చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పలు వయసుల వారిలో రక్తహీనత ఎక్కువగా ఉండటం రాష్ట్రంలో పోషకాహార పరిస్థితులపై ఆందోళన కలిగిస్తోంది.