Andhra Pradesh: గుంటూరు మిర్చి పంటపై మహీంద్రా ట్వీట్.. స్పందించిన మంత్రి లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గుంటూరు మిర్చి పంటకు సంబంధించిన వీడియోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మిర్చిని ఎండబెట్టినప్పుడు,నేలపై నుంచి చూస్తే సాధారణంగా కనిపించవచ్చని, అయితే ఏరియల్ వ్యూ నుంచి చూస్తే ఆ దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈపోస్టులో మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ,"ఈ దృశ్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయగలదా?"అని ప్రశ్నించారు. అలాగే హోలీ రోజు చూడటానికి ఇది సరైన వీడియో అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో విస్తారంగా బహిరంగ ప్రదేశాల్లో మిర్చిని ఆరబెట్టే దృశ్యాలు నేలస్థాయిలో చూస్తే అంతగా ఆకట్టుకోకపోవచ్చని,కానీ పై నుంచి చూసినప్పుడు రంగురంగులుగా అద్భుతంగా కనిపిస్తాయని చెప్పారు.
వివరాలు
రైతులు,స్థానికులు పొందగలిగే అదనపు ఆదాయ అవకాశాలు
తాను ఇంకా ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించలేదని, అయితే అక్కడ బెలూన్ రైడ్స్, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడితే పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రదేశాలకు పర్యాటకులు రావడాన్ని రైతులు ఇష్టపడకపోవచ్చని కొందరు భావించవచ్చని ఆయన అన్నారు. అయితే అలాంటి ఆలోచనల వల్ల రైతులు, స్థానికులు పొందగలిగే అదనపు ఆదాయ అవకాశాలను కోల్పోతారని కూడా ఆయన సూచించారు.
వివరాలు
ఆ దృశ్యం వేలాది మంది రైతుల కష్టానికి ప్రతిఫలం
ఆనంద్ మహీంద్రా చేసిన ఈ పోస్టుకు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆయన సూచనకు కృతజ్ఞతలు తెలుపుతూ, గుంటూరు మిర్చి దృశ్యాలను పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్‌ను కోరతానని తెలిపారు. మీరు ఆకాశం నుంచి చూసిన ఆ దృశ్యం వేలాది మంది రైతుల కష్టానికి ప్రతిఫలమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన డ్రోన్ వీడియోల్లో మహీంద్రా ఆటో ఫ్యాక్టరీతో పాటు రక్షణ రంగ సంస్థలు, ఏరోస్పేస్ పార్కులు వంటి పరిశ్రమల దృశ్యాలను కూడా చూడగలిగితే మరింత గొప్పగా ఉంటుందని లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి చూపించడానికి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానిస్తున్నామని కూడా ఆయన తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై స్పందించిన లోకేష్
Thank you Anand ji, for your thoughtful suggestion. I will request our tourism minister @kanduladurgesh to explore ways to enhance the tourism potential of this colorful sight. What you see from the sky is the result of thousands of farmers’ hard work and a tradition that has… https://t.co/hee6Scn4uv
— Lokesh Nara (@naralokesh) March 4, 2026