Tirumala: తిరుమల లడ్డూ కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు
గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన ఆదివారం ఉండవల్లిలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తిరుమలలో గత ఐదేళ్లుగా పవిత్రతకు విరుద్ధంగా చర్యలు జరుగుతున్నాయని, తిరుమలను రాజకీయ వేదికగా మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే పోరాటం చేశామన్నారు. చిన్నప్పటి నుంచి తిరుమల శ్రీవారిపై ఎంతో విశ్వాసముందని, అలిపిరి ఘటనలో ప్రాణాలతో బయటపడటమే స్వామివారి కృప అని తెలిపారు. ఆ బ్లాస్ట్‌లో ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని అన్నారు.
తప్పు చేసిన వారందరికీ స్వామి తగిన శిక్ష
తిరుమల స్వామి వారి మహత్యం గురించి చంద్రబాబు మాట్లాడుతూ, భక్తుల అకౌంట్లను స్వామి ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తారని అన్నారు. గత ఐదేళ్లలో భక్తుల మనోభావాలు, సమస్యలకు విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉపయోగించారని,అది ప్రజల మనోభావాలను దెబ్బతీశిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం శ్రీవారిని కూడా వదల్లేదని,లడ్డూ నాణ్యతను రివర్స్ టెండరింగ్ ద్వారా క్షీణతకు గురి చేసారని విమర్శించారు. ప్రధాన సంస్థలు టెండర్లలో పాల్గొనలేకపోయాయని,రివర్స్ టెండరింగ్ నిబంధనలను మార్చారని అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ,ఆవు నెయ్యి ధరపై ప్రశ్నలు లేవనెత్తారు. తిరుమలలో వ్యాపారాలు,వీఐపీ టికెట్లు అమ్మడం వంటి చర్యలను తప్పుబట్టారు. అన్యమతస్తులను టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం తగదని అన్నారు.తప్పు చేసిన వారందరికీ స్వామి తగిన శిక్ష విధిస్తారని చంద్రబాబు అన్నారు.
తిరుమలలో శాంతిహోమం
తిరుమల పునరుద్ధరణకు దేవుడు తనకు అవకాశం ఇచ్చారని,నూతన ఈవో శ్యామలరావుకు కూడా మార్గనిర్దేశం చేశామని తెలిపారు. లడ్డూనాణ్యతపై అనుమానాలు వచ్చినందున నెయ్యి శాంపిళ్లు పరీక్షల కోసం పంపించామని, పరీక్షల ఫలితాల ప్రకారం తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు. భవిష్యత్తులో ఈవ్యవహారాలను పర్యవేక్షించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుచేస్తామని చెప్పారు. తిరుమలలో సోమవారం శాంతిహోమం నిర్వహించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.ఉదయం6 నుండి 10గంటల వరకు హోమం,పంచగవ్య ప్రోక్షణ చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో హోమాలు నిర్వహించి,నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తామని వివరించారు. అన్నిమతాల ప్రాధాన్యతను గౌరవిస్తూ,ఆయా ప్రార్థనా మందిరాల్లో వారి మతం వారే బాధ్యతలు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మతసామరస్యం కోసం అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకువస్తామని,సంప్రదాయాలను కాపాడేందుకు పండితులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.