CM Chandrababu: అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలి.. సీఎం చంద్రబాబు ఆదేశం
రాజధాని అమరావతిలో ఉన్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినప్పటికీ, ఆ అదనపు భారాన్ని సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ)భరించాలనన్నారు. 2018లో ఫ్లాట్ల బుకింగ్ సమయంలో ఖరారు చేసిన ధరలకే కొనుగోలుదారులకు ఫ్లాట్లు అందించాలని సీఎం స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ 37వ అథారిటీ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు సవరించిన అంచనాలు, కొన్ని ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. గత ఐదేళ్లుగా ప్రాజెక్టు నిలిచిపోయిన కారణంగా, నిర్మాణ వ్యయం రూ.714 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెరిగింది. ధర పెంచకుండా ప్రాజెక్టును పూర్తిచేస్తే సీఆర్‌డీఏకు రూ.216 కోట్ల నష్టం ఉండొచ్చని అంచనా వేసారు.
భూసమీకరణపై చర్చ
రాజధాని అమరావతిలో ఇంకా 3,551 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల నుంచి ఎక్కువ భూమి రావాల్సి ఉంది. రైతులు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్యాకేజీ పెంచాలన్న డిమాండ్లు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ప్యాకేజీ పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. రైతులకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు, స్థలాల కేటాయింపులో కొన్ని సడలింపులు ఇవ్వాలని అథారిటీ నిర్ణయించింది.
నిర్మాణ పనుల పురోగతి
అమరావతిలో నిర్మాణాల పటిష్ఠతపై ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ నివేదికలు సెప్టెంబరు మొదటివారంలో అందనున్నాయి. నివేదికలు అందిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
సీఆర్‌డీఏ పరిపాలనా భవన నిర్మాణానికి రూ.160 కోట్లు
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలో 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన సీఆర్‌డీఏ పరిపాలనా భవన నిర్మాణం పూర్తిచేయడానికి అథారిటీ రూ.160కోట్లను మంజూరు చేసింది. ఈ నిర్మాణం కొంతవరకు పూర్తవ్వగా,సీఎం 90 రోజుల్లో భవనాన్నివినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇంతకుముందు ఈ ప్రాజెక్టుపై రూ.61 కోట్లు ఖర్చు చేశారు.భవనంలో సీఆర్‌డీఏ కార్యాలయం, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల రాష్ట్రస్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. భవనంలో రెండు అంతస్తుల్లో పురపాలకశాఖ కమిషనర్,మెప్మా,ఇంజినీరింగ్,టౌన్ ప్లానింగ్ విభాగాలు, టిడ్కో కార్యాలయాలు ఉంటాయి. మూడు అంతస్తుల్లో సీఆర్‌డీఏ కార్యాలయం,ఒక అంతస్తులో అమరావతి అభివృద్ధి సంస్థ కార్యాలయం ఉంటాయి. మిగతా ప్రాంతాలను రిసెప్షన్, ఇతర అవసరాలకు ఉపయోగిస్తారని తెలిపారు.
సెప్టెంబర్ 15లోగా రైతులకు రూ.175 కోట్లు
రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు గత ఏడాది కౌలు మొత్తంగా రూ.175 కోట్లను సెప్టెంబర్ 15 నాటికి చెల్లిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఈ ఏడాదికి సంబంధించి రూ.225 కోట్లను కొద్ది రోజులలోనే ఇవ్వనున్నామని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని రైతులు కొంత ఓపిక చూపాలని మంత్రి కోరారు. ''ప్రస్తుతం ఖజానా ఖాళీగా ఉంది. అందులోని నిధులు సర్దుబాట్లకే సరిపోతున్నాయి. గత ఏడాది కౌలు రూ.175 కోట్లను ఈ నెలలోనే ఇవ్వాలని యోచించాం. కానీ పింఛన్ల కోసం పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతున్నందున, ఆర్థిక శాఖ కొంత సమయం కావాలని కోరింది. అందుకే సెప్టెంబర్ 15 నాటికి చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నాం'' అని మంత్రి వివరించారు.