Page Loader
ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
త్వరలో చిత్రావతి రిజర్వాయర్‌ వద్ద అదానీ హైబ్రిడ్‌ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు పనులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం

వ్రాసిన వారు Stalin
Feb 24, 2023
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని చిత్రావతి రిజర్వాయర్‌ వద్ద అదానీ గ్రూప్‌ చేపట్టనున్న 500మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ హైబ్రిడ్‌ గ్రీన్‌‌ఎనర్జీ ప్రాజెక్టు నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ జిల్లా మేనేజర్ కోదండరామమూర్తి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో రెండు రాయలసీమ జిల్లాల్లో, మిగిలిన రెండు ఉత్తర ఆంధ్రలోని పార్వతీపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. దాదాపు రూ. 16,000 కోట్లతో 3,700 మెగావాట్ల విద్యుత్ లక్ష్యంగా నాలుగు ప్లాంట్‌లను అదానీ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో 10,000 ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది.

ఆంధ్రప్రదేశ్

పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టుల కింద ప్రభుత్వానికి రూ.3వేల కోట్ల ఆదాయం

రాయలసీమ ప్రాంతంలో మైలవరంలోని సోమశిల ప్రాజెక్టు- కర్నూలు జిల్లా అవుకు మధ్యలో మరో 3,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అదాని గ్రూప్ ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ జిల్లా మేనేజర్ కోదండరామమూర్తి తెలిపారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రాష్ట్రంలో 6,400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అదనంగా ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలో ఈ నాలుగు ప్రాజెక్టుల పనులు ప్రారంభమై, 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టుల కింద పవర్ స్టోరేజీ సిస్టమ్స్‌పై కూడా ప్రభుత్వానికి రూ.3,000కోట్ల ఆదాయం సమకూరనుంది.