Special Fund To Farmers: రైతుల కోసం సరికొత్త కార్యాచరణ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం..రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల అభ్యున్నతికి కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు.
కష్టపడి సాగు చేసిన పంటలకు సరైన ధరలు లభించకపోవడంతో, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వం నిశ్చయించింది.
రైతుల భద్రతను కాపాడటమే కాకుండా, వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచి, మానసిక పరంగా సంతోషంగా ఉండేలా చేయాలని సంకల్పించింది.
ఈ విధానం ద్వారా రైతుల ఆత్మహత్యలను అడ్డుకోవడంతో పాటు, వారి ఒత్తిడిని తగ్గించి, జీవితంపై నమ్మకం పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
వివరాలు
నిధిని సమీకరించేందుకు బ్యాంకర్ల సహాయం
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిధిని సమీకరించేందుకు బ్యాంకర్ల సహాయంతో ఫండ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
అవసరమైతే రూ.100 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు నాయుడు రైతుల పరిస్థితిని ప్రస్తావిస్తూ,"ఏదైనా పరిశ్రమ కుదేలైతే,దాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది.మరి రైతు నష్టపోతే ఎందుకు సహాయం చేయకూడదు? రైతు జీవితానికి ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వంగా, తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం" అని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడంతో పాటు, వారికి మానసిక బలాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
రైతుల కోసం కౌన్సెలింగ్ సదుపాయం
రైతుల ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, ప్రభుత్వం నిపుణుల బృందాలను ఏర్పాటు చేయనుంది.
ఆయా గ్రామాల్లో రైతులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.
గతంలో వ్యవసాయ వ్యయాలు తక్కువగా ఉండేవి, దిగుబడి ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.
పెట్టుబడులు పెరిగి, తెగుళ్లు, వాతావరణ మార్పులు పెరిగాయి. దాంతో పంట దిగుబడి తగ్గిపోయి, మార్కెట్‌లో సరైన ధరలు లభించని సమస్య ఎదురవుతోంది.
వివరాలు
రైతుల కోసం కౌన్సెలింగ్ సదుపాయం
ఇటీవల టమాటా, మిరప రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు.
అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారికి ఉచితంగా కౌన్సెలింగ్ సదుపాయం కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ చర్యల ద్వారా రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు.
రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక కొత్త దిశను సూచించబోతున్నాయి.