Andhra pradesh: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం .. ఒక్కొక్కరికి రూ.2,000లు..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం విజ్ఞాన విహార యాత్రలను నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ యాత్రల ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని శాస్త్రీయ, సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం పొందుతారు.
ఈ విద్యా పర్యటనల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, మానసిక వికాసాన్ని ప్రోత్సహించడం, శాస్త్ర సాంకేతిక రంగాలపై వారి ఆసక్తిని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వివిధ రంగాలపై అవగాహన కల్పించడంలో ఈ యాత్రలు కీలకంగా మారతాయని వారు అభిప్రాయపడ్డారు.
వివరాలు
7,784 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా
ఈ విజ్ఞాన విహార యాత్రలు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ప్రదేశాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నారు.
సంప్రదాయ కళా కేంద్రాలు, పురావస్తు ప్రదేశాలు, పరిశోధనా సంస్థలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక కేంద్రాలు వంటి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కొత్త విషయాలపై ఆసక్తిని పెంచడంతో పాటు వారి అనుభవాలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 7,784 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. విద్యార్థుల భద్రత, మార్గదర్శకత్వం కోసం ఎస్కార్ట్ ఉపాధ్యాయులను కూడా నియమించనున్నారు.
వివరాలు
ప్రయాణ ఖర్చును ప్రభుత్వందే
రాష్ట్రంలోని ప్రదేశాలను సందర్శించే విద్యార్థులకు రూ.200, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి రూ.2,000 ప్రయాణ ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది.
ఈ మేరకు సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష అనుభవాల ద్వారా కొత్త విషయాలను నేర్చుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది.