
Andhra News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా.. మార్గదర్శకాలు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం సడలించింది.
మే 16 నుండి జూన్ 2 వరకు ఈ బదిలీలకు అనుమతినిస్తూ గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ సమయంలో బదిలీలు, పోస్టింగ్‌లు నిర్వహించుకునేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
జూన్ 3 నుండి మళ్లీ బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుందని ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పియూష్ కుమార్ స్పష్టం చేశారు.
వివరాలు
బదిలీకి అర్హతల అంశాలు:
ఒకే స్థలంలో ఐదేళ్ల పాటు పనిచేసిన ఉద్యోగులు ఈ నెలాఖరుకు తప్పనిసరిగా బదిలీ అవ్వాల్సి ఉంటుంది.
ఐదేళ్లు పూర్తికాని వారు కూడా తమ అభ్యర్థన మేరకు బదిలీకి అర్హులు.
2026 మే 31లోపు రిటైరయ్యే ఉద్యోగులకు సాధారణంగా బదిలీ ఉండదు. అయితే వారు స్వయంగా కోరినపుడు లేదా పరిపాలన కారణాల నేపథ్యంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని బదిలీ చేయవచ్చు.
వివరాలు
స్టేషన్, పని వ్యవధి పరిగణన:
ఒక స్టేషన్‌లో అన్ని కేడర్లలో పనిచేసిన మొత్తం కాలాన్ని పరిగణిస్తారు.
'స్టేషన్'అంటే ఉద్యోగి పనిచేసిన నగరం,పట్టణం లేదా గ్రామాన్ని సూచిస్తుంది;కార్యాలయం లేదా సంస్థలను పరిగణనలోకి తీసుకోరు.
ప్రాధాన్య కేటగిరీలు:
దృష్టిసంబంధిత సమస్యలతో బాధపడేవారికి బదిలీలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.
మానసిక వైకల్యమున్న పిల్లలున్న ఉద్యోగులు, అవసరమైన వైద్య సదుపాయాలున్న స్టేషన్‌కు బదిలీ కోరితే,వారికి ముందుగానే అవకాశం కల్పించబడుతుంది.
గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పని చేసినవారు,40శాతం కంటే ఎక్కువ శారీరక వైకల్యం ఉన్నవారికి బదిలీలో ప్రాధాన్యం.
ఉద్యోగి, భార్య/భర్త లేదా వారు ఆధారపడే పిల్లల్లో ఎవరికైనా క్యాన్సర్,ఓపెన్ హార్ట్ సర్జరీ,న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే.. సంబంధిత వైద్య సదుపాయాలు ఉన్న ప్రాంతాలకు బదిలీలో ప్రాధాన్యం ఉంటుంది.
వివరాలు
ఏజెన్సీ ప్రాంతాల ఖాళీల భర్తీపై మార్గదర్శకాలు:
కారుణ్య నియామకంలో నియమితులైన వితంతు మహిళా ఉద్యోగులకు కూడా బదిలీలో ప్రాధాన్యం కల్పించబడుతుంది.
మొదటగా నోటిఫై చేయబడిన ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీలను భర్తీ చేయాలి.
అనంతరం నాన్-ఐటీడీఏ ప్రాంతాల్లోని పోస్టులను నింపాలి.
ఐటీడీఏ, మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువ ఖాళీలున్న చోట్లకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలి.
ఐటీడీఏ ప్రాంతాల్లో రెండు సంవత్సరాలకుపైగా పనిచేసిన స్థానిక, జోనల్ కేడర్ ఉద్యోగులు తమకు ఇష్టమైన స్టేషన్‌కు బదిలీ అయ్యే అవకాశాన్ని పొందవచ్చు.
వివరాలు
ఏజెన్సీ నియామకానికి ప్రమాణాలు:
ఏజెన్సీ ప్రాంతాల్లో 50 ఏళ్లలోపు ఉద్యోగులనే నియమించాలి.
ఇప్పటివరకు ఐటీడీఏ ప్రాంతాల్లో పని చేయని వారిలో, మైదాన ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేసినవారికి బదిలీలో అవకాశం కల్పించాలి.
ఐటీడీఏ ప్రాంతం నుంచి బదిలీ అయ్యే ఉద్యోగి స్థానంలో కొత్త అధికారి రిపోర్ట్ చేసిన తర్వాతే గత అధికారిని రిలీవ్ చేయాలి.
నాన్-ఐటీడీఏ ప్రాంతం నుంచి ఐటీడీఏ ప్రాంతానికి పోస్టింగ్ వచ్చినవారు గడువులోపు రిపోర్ట్ చేయాల్సిందే. లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు చేపడతారు.
వివరాలు
ఉద్యోగ సంఘాల నేతలకు మినహాయింపు:
గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల్లో రాష్ట్ర, జిల్లా, డివిజన్/మండల స్థాయిలో ఉన్న ఆఫీసు బేరర్లను మూడవ టెర్మ్ పూర్తయ్యే వరకు లేదా ఒకే స్టేషన్‌లో 9 సంవత్సరాలు పూర్తయ్యే వరకు బదిలీ చేయరాదు.
తాలూకా, జిల్లా స్థాయి సంఘాల ఆఫీసు బేరర్ల జాబితాను సంబంధిత కలెక్టర్ ద్వారా హెచ్‌వోడీకి పంపాలి.
రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాల జాబితాను మాత్రం కేవలం జీఏడీ (GAD) ద్వారానే రాష్ట్ర హెచ్‌వోడీకి పంపాలి.
వివరాలు
బదిలీ ప్రక్రియ నిర్వహణపై మార్గదర్శకాలు:
అన్ని బదిలీలను సంబంధిత శాఖ విధానాలు, నియామకాల ప్రకారం చేపట్టాలి.
జిల్లా, జోన్, మల్టీజోన్ కేడర్ల ఉద్యోగులకు బదిలీ, పోస్టింగ్‌ల విషయంలో ఆయా ఉమ్మడి జిల్లాలు, జోన్‌లు, మల్టీజోన్‌లను యూనిట్లుగా పరిగణిస్తారు.
ప్రతి శాఖలో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసి, అభ్యర్థనలు పరిశీలించి తగిన సిఫార్సులను ఉన్నతాధికారులకు పంపాలి.
బదిలీ ప్రక్రియ బాధ్యత పూర్తిగా విభాగాధిపతులదే. పారదర్శకంగా, సమయానికి బదిలీలు పూర్తి చేయాలి. ఫిర్యాదులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్గదర్శకాలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
వివరాలు
పదోన్నతికి అనుసంధానంగా బదిలీ:
పదోన్నతి పొందిన ఉద్యోగులు తప్పనిసరిగా ప్రస్తుత స్థానం నుండి బదిలీ అవ్వాలి.
పదోన్నతికి అనుగుణమైన పోస్టులు ఇతర ప్రాంతాల్లో లేనప్పుడు మాత్రమే ఉద్యోగిని ప్రస్తుతం ఉన్న స్థానంలో కొనసాగించవచ్చు.
దృష్టి సమస్యలు ఉన్న ఉద్యోగులను సాధారణంగా బదిలీ నుంచి మినహాయిస్తారు. అయితే వారు స్వయంగా అభ్యర్థించినపుడు ఖాళీ ఉన్నచోట నియమించే అవకాశం ఉంటుంది.
భర్త, భార్య ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై ఉంటే, వారిని ఒకే ప్రాంతంలో లేదా దగ్గరగా నియమించేలా చూడాలి.