Andhra Pradesh: ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు మంత్రి నారా లోకేష్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అమరావతి అసెంబ్లీలోని పేషిలో జరిగిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యతను మెరుగుపరిచి, విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రైవేట్ కళాశాలలకు సమానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల విద్యను మెరుగుపరిచేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి క్యాలెండర్‌లో మార్పులు చేపట్టారు.
వివరాలు
ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు
ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రారంభ తేదీని జూన్ 1 నుంచి ఏప్రిల్ 1కి మార్చారు.
అలాగే, అడ్మిషన్ ప్రక్రియను జూన్ 1కు బదులుగా ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించనున్నారు.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలను ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహించనున్నారు.
ఇంటర్మీడియట్ విద్యను మరింత ఆధునీకరించేందుకు ట్యాబులేషన్ రిజిస్టర్లను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు.
డిజిలాకర్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభంగా ఆన్‌లైన్ యాక్సెస్ కల్పించేందుకు 1973 నుంచి 2003 వరకు ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల డేటాను డిజిటలైజ్ చేయనున్నారు.
వివరాలు
సబ్జెక్టుల ఎంపికలో మార్పులు, కొత్త కోర్సులు
విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో మరింత సౌలభ్యాన్ని కల్పించేందుకు,మొదటి సంవత్సరం నుంచే ఎలక్టివ్ సబ్జెక్టులను రెండో సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు.
విద్యార్థులు లాంగ్వేజెస్, సైన్స్, హ్యూమానిటీస్ విభాగాల్లోని 24 ఆప్షన్లలో ఒక సబ్జెక్టును రెండో సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు.
జూనియర్ కళాశాలల్లో ఎంబైపీసీ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులను కలిపి 6 సబ్జెక్టులతో కూడిన కొత్త కోర్సును అందుబాటులోకి తేవనున్నారు.
సైన్స్, హ్యూమానిటీస్, లాంగ్వేజెస్ విభాగాల్లో మొత్తం 14 సబ్జెక్టుల సవరించిన సిలబస్‌తో కొత్త పాఠ్యపుస్తకాలను అమలులోకి తీసుకురానున్నారు.
ఇంతవరకు రెండు సబ్జెక్టులుగా పరిగణిస్తున్న మ్యాథ్స్ ఏ,బీ లను విలీనం చేసి ఒకే సబ్జెక్టుగా చేసారు.
అలాగే,బాటనీ,జువాలజీ సబ్జెక్టులను కలిపి ఒకటిగా మార్చారు.ఈ మార్పుల వల్ల ఆయా సబ్జెక్టులకు సమానంగా వెయిటేజీ లభించనుంది.
వివరాలు
పోటీ పరీక్షల కోచింగ్, మెటీరియల్
ఈఏపీసెట్, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సిద్ధం చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేకంగా కోచింగ్ మెటీరియల్ రూపొందించనుంది.
ఈ మెటీరియల్‌ను బోర్డు పోర్టల్‌లో అందుబాటులో ఉంచి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా అందజేస్తారు.
కొత్త పరీక్షా విధానం, వృత్తిపరమైన కోర్సులు
ఇంటర్మీడియట్, సైన్స్, హ్యూమానిటీస్ విభాగాల్లో ప్రశ్నపత్రంలో 10% బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQs), ఖాళీలను పూరించే ప్రశ్నలను తప్పనిసరిగా చేర్చనున్నారు.
దీనివల్ల విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మెరుగైన ప్రామాణికత లభించనుంది. వృత్తిపరమైన విద్యలో నైపుణ్యాలను పెంచేందుకు NSQF ప్రమాణాలను అనుసరించి సిలబస్ సవరణ చేయనున్నారు.
వృత్తి విద్యార్థులకు డ్యుయల్ సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
వివరాలు
సంస్కరణల ప్రాధాన్యత
వృత్తిపరమైన కోర్సుల పాఠ్యాంశాలను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మారుస్తూ, ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ సంస్కరణల ద్వారా ఇంటర్మీడియట్ విద్యను మరింత నాణ్యతతో, పోటీ విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దనున్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా అభివృద్ధి చేయడంతోపాటు, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఈ నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.