Airports: ఆంధ్రప్రదేశ్ లో మరో ఏడు విమానాశ్రయాలు .. ఎక్కడంటే ?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ అంతటా ఏడు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అన్వేషించడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంగీకరించింది. కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన కేంద్ర పౌరవిమానయానశాఖ ఆయా జిల్లాలలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి అవసరమైన అధ్యయనాలు నిర్వహించడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన కుప్పం, నెల్లూరు,కాకినాడ, నాగార్జున సాగర్, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. దీనిపై స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ జిల్లాలలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఉన్న అనుకూలతలపై అధ్యయనానికి అంగీకరించింది.
రెగ్యులర్ ఎయిర్ పోర్టుల్లో ట్రాఫిక్ పెంపు, కొత్త సర్వీసులు తెచ్చేందుకు ప్రయత్నాలు
ప్రతిపాదించిన జిల్లాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణం చేపడితే ఎంత ఖర్చవుతుంది ? ప్రయాణికుల స్పందన ఏంటి ? ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉందన్న దానిపై అధ్యయనం చేయనుంది. ఒంగోలు, తాడేపల్లిగూడెం, తుని-అన్నవరం మధ్య ప్రాంతాన్ని రెండో దశలో ఎయిర్‌పోర్టు సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పుట్టపర్తిలోని ప్రైవేట్ ఎయిర్‌పోర్టును పబ్లిక్ ఫెసిలిటీగా మార్చే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న రెగ్యులర్ ఎయిర్ పోర్టుల్లో ట్రాఫిక్ పెంపు, కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్ర పౌరవిమానయానమంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో ఎంపీలు ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు