Andhrapradesh: రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ అమలుకు ప్రభుత్వం సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
పౌరసరఫరాల సేవల్లో మరింత పారదర్శకతతో పాటు జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో గుజరాత్‌లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి మంత్రి శుక్రవారం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్, అహ్మదాబాద్ నగరాల్లో పర్యటించారు. అక్కడ సీబీడీసీ పథకం క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతోందో ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం గుజరాత్ పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమై పథకం అమలు విధానం, దాని ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించారు.
వివరాలు
త్వరలో ఆ రెండు నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం..
మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన వివరాల ప్రకారం, సీబీడీసీ విధానంలో పౌరసరఫరాల సేవలు పొందుతున్న లబ్ధిదారులు తమ అవసరాలకు అనుగుణంగా, తాము కోరుకున్న పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందించే నిర్దిష్ట సరుకులకు మాత్రమే పరిమితం కాకుండా, అవసరమైన ఇతర వస్తువులను కూడా డిజిటల్ రూపీ ద్వారా చెల్లింపు చేసి పొందవచ్చు. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తొలి దశలో విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.