Loading...
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు చేబదుళ్ల పరిమితి పెంపు.. రూ.2,921 కోట్ల నుంచి రూ.3,197 కోట్లు
రూ.2,921 కోట్ల నుంచి రూ.3,197 కోట్లు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు చేబదుళ్ల పరిమితి పెంపు.. రూ.2,921 కోట్ల నుంచి రూ.3,197 కోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే చేబదుళ్ల (వేస్‌ అండ్‌ మీన్స్‌) పరిమితిని 11.2 శాతం పెంచాలని ఆర్‌బీఐ సలహా కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన నివేదికలో పలు సూచనలు చేసింది. ప్రతిపాదిత పెంపుతో దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు ఈ పద్దు కింద నెలవారీగా లభించే చేబదుళ్ల మొత్తం రూ.61,008 కోట్ల నుంచి రూ.67,839 కోట్లకు చేరనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉన్న రూ.2,921 కోట్ల పరిమితి 9.4 శాతం పెరిగి రూ.3,197 కోట్లకు చేరనుంది. 2022-23 నుంచి 2024-25 మధ్య రాష్ట్రాలు సాధించిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కమిటీ ఈ సిఫార్సులు చేసింది.

వివరాలు 

ఓడీని వరుసగా వినియోగించే గరిష్ఠ రోజుల 10కి తగ్గించాలని సిఫార్సు

స్వల్పకాలిక అవసరాలకు ఉపయోగించుకోవాలి: పెంచిన చేబదుళ్ల పరిమితి ద్వారా కలిగే ప్రయోజనాలను రాష్ట్రాలు వినియోగించుకుని తమ స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చుకోవాలని ఆర్‌ బి ఐ కమిటీ సూచించింది.

ఇటీవల రాష్ట్రాలు ఓవర్‌డ్రాఫ్ట్‌ (ఓడీ)సదుపాయాన్ని ఉపయోగించుకునే రోజులు తగ్గిన విషయాన్ని కూడా నివేదికలో ప్రస్తావించింది.

ఈ నేపథ్యంలో ఓడీని వరుసగా వినియోగించే గరిష్ఠ రోజులను 14 నుంచి 10కి తగ్గించాలని సిఫార్సు చేసింది.

ఒక త్రైమాసికంలో ఓడీని ఉపయోగించుకునే గరిష్ఠ రోజుల పరిమితిని కూడా 36 నుంచి 30 రోజులకు తగ్గించాలని సూచించింది.

సీఎస్‌ఎఫ్‌, జీఆర్‌ఎఫ్‌లలో నిల్వలపై సూచనలు: కన్సాలిడేటెడ్‌ సింకింగ్‌ ఫండ్‌ (సీఎస్‌ఎఫ్‌), గ్యారంటీ రిడంప్షన్‌ ఫండ్‌ (జీఆర్‌ఎఫ్‌)ల్లో రాష్ట్రాలు కనీసం 5 శాతం నిధులను నిల్వగా ఉంచాలనే నిబంధన ఉంది.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ఎఫ్‌లో రూ.8,307 కోట్ల నిధులు

అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ఈ స్థాయికి చేరుకోలేదని ఆర్‌బీఐ కమిటీ గుర్తించింది.

ఈ రెండు నిధుల్లో నిర్దేశిత స్థాయిలో నిల్వలు ఉంచేలా రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని సూచించింది.

ఏపీ నిధుల పరిస్థితి: 2026 జులై నాటికి ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ఎఫ్‌లో రూ.8,307 కోట్ల నిధులు ఉన్నాయి.

రాష్ట్రం మార్కెట్‌ నుంచి తీసుకున్న మొత్తం రుణాల్లో ఈ నిధులు 1.6 శాతానికి సమానం. అదే సమయంలో జీఆర్‌ఎఫ్‌లో రూ.8,958 కోట్ల నిల్వ ఉంది.

ప్రభుత్వం ఇచ్చిన మొత్తం గ్యారంటీలతో పోలిస్తే ఇది 5.8 శాతంగా ఉంది.

జీఆర్‌ఎఫ్‌లో ఆర్‌బీఐ సిఫార్సు చేసిన స్థాయిలో ఏపీ నిల్వలు ఉన్నప్పటికీ, సీఎస్‌ఎఫ్‌లో మాత్రం నిర్దేశిత స్థాయి కంటే తక్కువగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

ADVERTISEMENT