LOADING...
Free bus travel for women:మహిళలకు ఉచిత బస్ ప్రయాణం: హర్యానా, ఏపీ ప్రభుత్వాల కీలక ప్రకటన 
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం: హర్యానా, ఏపీ ప్రభుత్వాల కీలక ప్రకటన

Free bus travel for women:మహిళలకు ఉచిత బస్ ప్రయాణం: హర్యానా, ఏపీ ప్రభుత్వాల కీలక ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ప్రయాణం సులభంగా ఉండాలనే ఉద్దేశంతో హర్యానా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉచిత బస్ ప్రయాణం సదుపాయాన్ని ప్రకటించాయి. హర్యానా రోడ్వేస్‌ అధికారులు ఆగస్ట్ 7న అధికారికంగా ప్రకటించిన ప్రకారం, రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ రోజున ఉచిత బస్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయం రాఖీతో పాటు స్వాతంత్ర్య దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా కుటుంబాలపై ప్రయాణ భారం తగ్గించడంతో పాటు, ప్రభుత్వ బస్సులను మరింత మంది వాడేలా చేయడమే లక్ష్యంగా ఉంది.

వివరాలు 

హర్యానా రోడ్వేస్‌కు చెందిన బస్సుల్లో ఉచితం

హర్యానాలో మహిళలతో పాటు వారి పిల్లలు (15 ఏళ్లు వయస్సు వరకు) హర్యానా రోడ్వేస్‌కు చెందిన బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఆగస్ట్ 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆగస్ట్ 9 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ అవకాశాన్ని రాష్ట్రంలో నడిచే సాధారణ బస్సులతో పాటు,చండీగఢ్,ఢిల్లీకి వెళ్లే బస్సుల్లోనూ వర్తింపజేస్తారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌పోర్ట్ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. ఈ సదుపాయాన్ని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. కొన్ని నివేదికల ప్రకారం,ప్రయివేటు బస్సుల షెడ్యూల్‌లు సరిగా అమలవడంలేదని అనిల్ విజ్ తెలిపారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను సమీక్షించి, అవసరమైతే షెడ్యూల్‌లను సర్దుబాటు చేయాలని సూచించారు.

వివరాలు 

రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌పోర్ట్ జనరల్ మేనేజర్లకు ఆదేశాలు

ప్రభుత్వ బస్సులు సమర్ధవంతంగా నడవకపోవడానికి ప్రయివేటు బస్సుల ముందుగా బయలుదేరడమే ప్రధాన కారణంగా మారిందని మంత్రి విజ్ అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలిపారు. హర్యానాలో ప్రతి గ్రామానికి రోడ్వేస్ బస్సులు చేరేలా చర్యలు తీసుకుంటామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌పోర్ట్ జనరల్ మేనేజర్లకు ఆదేశాలు పంపినట్లు వెల్లడించారు. అలాగే, ఆయన ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. "ఇది రాజకీయం కోసం కాదని, ప్రజలతో కలిసి మాట్లాడేందుకు, పార్టీ శ్రేణులను కలుసుకోవడానికే ఈ పర్యటనలు" అని మంత్రి స్పష్టం చేశారు.

వివరాలు 

మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ పథకం

ఇది ఇలావుండగా ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభించబోతున్నట్లు సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన "సూపర్ సిక్స్" కార్యక్రమాల పరిధిలో ఈ స్కీమ్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు అయన వివరించారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం అందుబాటులోకి రాబోతోందని ఆయన తెలిపారు.

వివరాలు 

ఈ రకాల బస్సుల్లోనే ఉచిత ప్రయాణం 

ఆగస్టు 15వతేదీ నుంచే ఈ పథకాన్నిఅధికారికంగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్థసారథి స్పష్టం చేశారు. ఈతరహా పథకాలు ఇప్పటికే అమలులో ఉన్న కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వం అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందే మహిళల కోసం అనేక హామీలను ప్రకటించినట్టు గుర్తు చేస్తూ, అందులో ఈ ఉచిత బస్సు పథకంపై మహిళల నుంచి విస్తృత స్పందన వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా మహిళలు"జీరో టికెటింగ్"విధానంలో ప్రయాణించవచ్చని మంత్రి తెలిపారు. పల్లెవెలుగు,అల్ట్రా పల్లెవెలుగు,ఎక్స్‌ప్రెస్,అల్ట్రా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈపథకం వర్తించనున్నదని స్పష్టం చేశారు. అన్నిరకాల సామాన్య బస్సుల్లో ఉచితప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని ఆయన వివరించారు.