
Annadata Sukhibhava: రేపే 'పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ'.. దర్శిలో పథకానికి శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా, 'పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ' పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. మొదటి విడతగా, ప్రతి రైతు ఖాతాలో రూ.5,000 చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఇది కాకుండా, కేంద్ర ప్రభుత్వం కూడా 'పీఎం కిసాన్' పథకం కింద రూ.2,000 చొప్పున మొత్తం రూ.831.51 కోట్లు మొదటి విడతగా అందించనుంది. ఫలితంగా ఆగస్టు 2న ఒక్కో రైతు ఖాతాలో మొత్తం రూ.7,000 జమకానుంది.
వివరాలు
'అన్నదాతా సుఖీభవ' కింద రూ.14,000
ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20,000 ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా, కేంద్రం ఇచ్చే రూ.6,000 పీఎం కిసాన్ సాయంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం 'అన్నదాతా సుఖీభవ' కింద రూ.14,000 అదనంగా చెల్లించనుంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఈ మొత్తం చెల్లించనుంది. మొదటి రెండు విడతల్లో రూ.5,000 చొప్పున, మూడో విడతలో రూ.4,000 చొప్పున ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 59,750 దరఖాస్తులు ఈ పథకానికి వచ్చాయి. వాటిలో 58,464 వినతులు పరిష్కరించబడ్డాయి. పథకం అమలుపై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి టోల్‌ఫ్రీ నంబర్ 155251 అందుబాటులో ఉంచారు.
వివరాలు
ప్రతి అర్హుడికీ లబ్ధి కలగాలి: ముఖ్యమంత్రి
ఈ పథకం ప్రతి అర్హ రైతుకు చేరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, పథక అమలుపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆగస్టు 2న, గ్రామ సచివాలయాలు, పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరగాలని సూచించారు.
వివరాలు
గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసంతోపాటు అన్ని వ్యవస్థలు ఛిన్నాభిన్నం
"గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. అన్ని విభాగాలూ ఛిన్నాభిన్నమయ్యాయి. వాటిని మళ్లీ నిర్మిస్తున్నాం. పథకం అమలుకు ముందు రైతుల సెల్‌ఫోన్లకు 'మనమిత్ర' ద్వారా సమాచారం పంపించాలి. బ్యాంకు ఖాతాలు యాక్టివ్‌గా ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇప్పటివరకు రైతులకు అందిన సాయంపై కరపత్రాలు తయారుచేసి ప్రజల్లో పంపాలి. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలి" అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
వివరాలు
ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావం
ముఖ్యమంత్రి చంద్రబాబు, భారత్‌పై అమెరికా విధించిన 25% సుంకాల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజాగా బొప్పాయి ధరలు పడిపోయినట్లు వార్తలు రావడంతో, దాని పట్ల సమీక్షించి రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల కొరత ఎక్కడా ఉండకూడదని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద వస్తోందని, దాన్ని అనుసరించి గండికోట, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టులను శాతం నీటితో నింపాలని తెలిపారు. ప్రతి రిజర్వాయర్లో నీటి స్థితి గురించి సమాచారం ఉండాలని, నీటి నిర్వహణ పకడ్బందీగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.