Andhrapradesh Cyclone : ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్!
ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడటంతో రాష్ట్రం వరదలలో మునిగిపోయింది. మూడు రోజుల పాటు కురిసిన వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వర్షాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో, వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని, అది తుఫానుగా మారి ఉత్తరాంధ్ర,ఒడిశా మధ్య తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్‌పై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని అధికారులు పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావం నుంచి పూర్తిగా తేరుకోకముందే, తుఫాన్‌పై భయాందోళనలు మొదలయ్యాయి.
సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో గణనీయమైన నష్టాన్ని చవిచూశాయి. ఏపీలో విజయవాడ వర్షాలతో ముంచెత్తింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నగరంపై భారీ వర్షాలు పడటంతో నగరం మొత్తం వరదల గుప్పిట్లో చిక్కుకుంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరుపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి, వందలాది రైళ్లు రద్దు అయ్యాయి, జాతీయ రహదారుల మీద వరద ప్రవహిస్తూ, వాహన రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో మరో తుఫాన్ ముప్పు ఉందని అంచనాలు వెలువడటంతో ప్రజలలో ఆందోళన పెరిగింది. విజయవాడలో వరద బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వివిధ రాష్ట్రాల నుండి విజయవాడకు చేరుకున్నాయి.
బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీరు విడుదల
ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ప్రజలు వాగులు, కాలువలు, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ నుంచి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు, 70 గేట్లు తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు.