హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు; 10వేల మందికి ఉద్యోగాలు
విశ్వ నగరం హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వినూత్నమైన కస్టమర్ కేర్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ (CX) సొల్యూషన్‌ల ప్రముఖ ప్రొవైడర్ బైన్ క్యాపిటల్ యాజమాన్యంలోని వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ కంపెనీ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టబోతోంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ తన డెలివరీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. తద్వారా ఈ సంస్థ 10,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించనుంది. వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్‌ఆర్ఓ) ఎరికా బోగర్ కింగ్‌తో సమావేశమైన తర్వాత కేటీఆర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
పెట్టుబడుల మాగ్నెట్‌గా తెలంగాణ: కేటీఆర్
అనంతరం హ్యూస్టన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ పెట్టుబడుల మాగ్నెట్‌గా మారిందన్నారు. ప్రగతిశీల విధానాలు, దృఢమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి పేరుగాంచిన తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి స్థిరంగా పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో 4.50 లక్షల ఉద్యోగాలు ఏర్పడగా అందులో 1.5 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని మంత్రి ఉద్ఘాటించారు. 1998లో స్థాపించబడిన వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, కరేబియన్‌లోని 42 కంటే ఎక్కువ ప్రదేశాలలో 40,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.